జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల వ్యూహం… ఏమిటో అర్థం కాక వామపక్ష పార్టీలు టెన్షన్‌కు గురవుతున్నాయి. తమతో కలిసి పోరాటాలు చేస్తున్న పవన్ కల్యాణ్… వచ్చే ఎన్నికల్లో పొత్తులకు వస్తాడా లేదా అనేది వారికి పెద్ద మిస్టరీగా మారింది. పవన్ కల్యాణ్ తో పొత్తు కోసం వారు చేయని ప్రయత్నాలు లేవు. ఎప్పటికప్పుడు పవన్ కల్యాణ్ మనసును సంతోషపరిచేలా.. మంచి మాటలు చెబుతూనే ఉన్నారు. పవన్ నాయకత్వన్ని పొగుడుతున్నారు. పవన్ కల్యాణ్ గెలవబోతున్నాడని జోస్యాలు కూడా చెప్పుకొచ్చారు. కానీ పవన్ కల్యాణ్ నోటి వెంట ఇప్పటి వరకూ పొత్తులనే మాట బయటకు రాలేదు. అయినా జనసేన అధినేత నిర్వహించే ఎలాంటి కార్యక్రమానికైనా.. ఆహ్వానం ఉన్నా.. లేకపోయినా.. సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం నేత మధు కచ్చితంగా హాజరవుతున్నారు.
కొద్ది రోజుల క్రితం… రాజకీయ ప్రత్యామ్నాయ వేదికగా.. కమ్యూనిస్టులు, జనేసన, లోక్ సత్తా సహా కలసి వచ్చే ఇతర పార్టీలన్నింటితో కలిసి మహాకూటమి ఏర్పాటు చేస్తున్నామని సీపీఐ నేత రామకృష్ణ ప్రకటించారు. పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్పష్టం చేశారు. అయినప్పటికీ జనసేవ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పవన్ పై ఒత్తిడి పెంచేందుకు ఇప్పుడు… సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ రంగంలోకి దిగారు. ఏపీలో పవన్‌తో కలిసి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని ప్రకటించారు. ఇప్పటికే జనసేనతో కలిసే ఉద్యమాలు చేస్తున్నామని గుర్తు చేశారు. జనసేనతో తమ స్నేహం ఎన్నికల వరకు కొనసాగుతుందని అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో నారాయణ పెద్దగా కనిపించడం లేదు. జాతీయస్థాయిలో పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించిందని… అందుకోసం ఢిల్లీకి మకాం మారుస్తున్నానని ప్రకటించారు.
గత ఎన్నికల్లో వామపక్ష పార్టీలు… తెలంగాణలో ఉనికి చాటుకున్నా.. ఏపీలో మాత్రం పూర్తిగా తేలిపోయారు. ఎవరూ పొత్తులు పెట్టుకోకపోవడంతో.. ఒంటరిగా పోటీ చేశారు. ఎక్కడా డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. ఈ సారి అసెంబ్లీలో తమ ఉనికిని చాటుకోకపోతే.. భవిష్యత్ ఉండదని భయపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీలు పొత్తులకు ముందుకు వచ్చే అవకాశాలు తక్కువే. అందుకే జనసేనపైనే వామపక్షాలు ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి.కానీ పవన్ మాత్రం వారిని వెయిటింగ్లో పెట్టారు. ఏమీ చెప్పడం లేదు. కానీ అప్పుడప్పుడు తాము 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెబుతూ షాక్ ఇస్తున్నారు.