హైదరాబాద్: ఒకే ర్యాంక్, ఒకే పెన్షన్ డిమాండ్‌తో మాజీ సైనికోద్యోగులు కొంతకాలంగా చేస్తున్న ఆందోళన ఎట్టకేలకు ఫలించింది. వారి ఆందోళనకు తలొగ్గిన కేంద్రప్రభుత్వం ఓఆర్ఓపీకి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది.. కేంద్ర రక్షణశాఖమంత్రి పారికర్ ఈ మధ్యాహ్నం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయంవలన దేశ ఖజానాపై రు.8 వేలకోట్లనుంచి రు.10వేల కోట్ల వరకు భారం పడుతుందని మంత్రి చెప్పారు. రు. 500 కోట్ల భారమేనని గత ప్రభుత్వాలు అంచనా వేశాయని తెలిపారు. బడ్జెట్లో రు.500 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. ఓఆర్ఓపీని ఐదేళ్ళకోసారి సమీక్షిస్తామని తెలిపారు. రెండేళ్ళకొకసారి సమీక్షించమన్న మాజీ సైనికుల డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోలేదు. పెన్షన్లలో సమానత్వంపై ఏకసభ్య కమిషన్‌ను నియమిస్తామని చెప్పారు. గత ఏడాది జులై 1 వ తేదీనుంచి దీనిని అమలు చేస్తామని, ఎరియర్స్‌ను నాలుగు అర్థ సంవత్సర వాయిదాలలో చెల్లిస్తామని, సైనికుల వితంతువులకు ఒకే వాయిదాలో చెల్లిస్తామని పారికర్ పేర్కొన్నారు.
కేంద్రం నిర్ణయంపై మాజీ సైనికోద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ 40 ఏళ్ళ నిరీక్షణ ఫలించిందంటున్నారు. ఓఆర్ఓపీ కోసం మాజీ సైనికోద్యోగులు 82 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారు.