కాపునాయకుడు ముద్రగడ పద్మనాభం వైద్య పరీక్షలకు అంగీకరించడం అందరికీ ఉపశమనం కలిగించింది. ఉద్రిక్తత చాలావరకూ తగ్గిపోయింది. ఈ మలిదీక్ష సందర్భంగా ఆయనకూ ప్రభుత్వానికి కుదిరిన అవగాహన ఏమిటో లిఖితపూర్వకంగా సవివరంగా ప్రజలకు చెప్పడం మంచిది. ఎందుకంటే రేపు మళ్లీ ఇరుపక్షాలూ తలో రకంగా చెబుతుంటే గండరగోళం ఏర్పడుతుంది. ఇప్పటికే గుజరాత్లో పటేళ్లు, రాజస్థాన్లో గుజ్జార్లు, హర్యానాలో జాట్లు, రకరకాలుగా రిజర్వేషన్ వివాదాలు నడుస్తున్నాయి.కనుక వెనువెంటనే అది జరిగిపోయేది కాదు. పైగా పార్లమెంటు తప్ప శాసనసభ చేస్తేచాలదు. న్యాయస్థానాలూ వుంటాయి. అదంతా దీర్ఘకాల వ్యవహారం.
కనుక తక్షణంగా అరెస్టులు కేసులపై ఏం చేస్తారన్నది ముఖ్యంగా చూడాలి. నిజంగా విధ్వంసానికి కారణమైన వారుంటే తప్పకచర్య తీసుకోవలసిందే. అయితే ఆపేరుతో ప్రభుత్వంచాలామందిని అనవసరంగా వేధించారని ఆరోపణ. వాటిని ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి.
ఈ ఉదంతం వల్ల కాపు నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని బాగా ఒత్తిడి చేయగలిగారనే సంతృప్తి వారిలోకనిపిస్తుంది. వైసీపీ రాజకీయంగా ఇది తమకు అనుకూలమైన పరిణామంగా లెక్కవేసుకుంటున్నది. ఎన్నికల తర్వాత కనీసం ఒక విషయంలోనైనా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టగలిగామని వారంటున్నారు. అయితే ముద్రగడ గతాన్ని బట్టి చూస్తే జగన్ ఆయనపై అతిగా ఆశలు పెట్టుకోవడం అర్థం లేనిదని మరికొందరు కొట్టిపారేస్తున్నారు.
ఇక తెలుగుదేశం నేతలైతే కాపులలో తమపట్ల వచ్చిన సద్భావాన్ని పోగొట్టుకోకుండా సంక్షోభం నుంచి బయిటపడ్దామనే వూరట కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా నిలబడి సంయమనంతో వ్యవహరించడమే ఇందుకు కారణమని వారి వాదన.
తెలుగుదేశంలోని కొంతమంది యువ నాయకులైతే పవన్ కళ్యాణ్ మాత్రమే గాక చిరంజీవి కూడా తమ వైపు మొగ్గుతారని చెబుతున్నారు. చిరంజీవి తెలుగుదేశం ఎంపిగా రాజ్యసభకు వెళతారు చూడండి అని అలాటి ఒక నేత జోస్యం చెప్పారు. అయితే గతంలో ఎన్నడూ లేనట్టు ఒక కులానికి చెందిన వివిధ రంగాల ప్రముఖులంతా బహిరంగంగా ఒకే వేదికపైకి వచ్చే పరిస్థితి ప్రభుత్వమే కల్పించందనే విమర్శ కూడా వుంది. ఈ విధంగా కుల విభజనలు రాజకీయాలలో చొరబడితే ముందుముందు మనం కూడా తమిళనాడు కేరళ లేదా బీహార్ యుపిల వలె తయారవుతామని వారు హెచ్చరిస్తున్నారు. అవతలి కులం వారు దీర్ఘకాలంగా కలసికట్టుగా కుట్రలు చేస్తుంటే విమర్శించని వారు తమపైనే ఎందుకు దృస్టిపెడుతున్నారని కాపు నాయకులు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. మొత్తంపైన ఇది కుల రాజకీయాలలోనూ మలి అధ్యాయంగా వుండొచ్చు.
ప్రభుత్వ తదుపరి చర్యలు పోలీసుల అడుగులు ముద్రగడ వ్యూహాలు, ఆయనను బలపర్చేవారి ఆలోచనలు అన్నీ ముందు ముందు మరింత స్పష్టంగా బయిటకు రావాలి. అప్పటికి గాని ఈ ఎపిసోడ్ ముగియదని గుర్తు పెట్టుకోవాలి.