పాలనలో పారదర్శకతే.. తన ప్రభుత్వ విధానమని… మొదట్లో గొప్పగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి.. ఏడాది చివరి రోజు.. పదుల సంఖ్యలో కాన్ఫిడెన్షియల్ జీవోలు రిలీజ్ చేసి.. తన మాటలు అంతగా పట్టించుకునేవి కావని మరోసారి నిరూపించారు. సాధారణంగా.. ఒకటో.. రెండో కాన్ఫిడెన్షియల్ జీవోలు విడుదలవుతూ ఉంటాయి. వివాదాస్పమవుతాయనుకున్న వాటిని అలా కాన్ఫిడెన్షియల్ పేరుతో రహస్యంగా ఉంచుతారు. కానీ ఇలా పదుల సంఖ్యలో ఒకే రోజు.. అదీ కూడా.. ఏడాది చివరి రోజు విడుదల చేయడం… చర్చనీయాంశంగా మారింది. ఈ రహస్య జీవోల్లో సగం పంచాయతీరాజ్ , గ్రామీభివృద్ధి శాఖల్లో..మిగతా సగం మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలకు సంబంధించి ఉన్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలను.. జనవరి నిర్వహించాల్సి ఉంది. లేకపోతే కోర్టు ధిక్కరణ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పంచాయతీ రిజర్వేషన్ల ఖరారుకు.. అధికారులు కసరత్తు చేస్తున్నారు. బహుశా.. ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఏమైనా ఉత్తర్వులు ఇచ్చి ఉంటారేమోనన్న అభిప్రాయం.. వ్యక్తమవుతోంది. అయితే.. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖనుంచి ఎందుకు అన్ని రహస్య జీవోలు వచ్చాయన్న విషయమే చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ వైపు రాజధాని ఉద్యమం జరుగుతూండగా.. పెద్ద ఎత్తున రహస్య జీవోలు రావడంతో.. దీనిపై.. రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలోనే… జగన్మోహన్ రెడ్డి సర్కార్… కనీసం.. రెండు వందలకుపైగా రహస్య జీవోలు విడుదల చేసింది. కొన్ని జీవోలు బయటకు రాకుండానే ఉపసంహరించుకున్నారు. మరికొన్నింటి గురించి ఇప్పటికీ బయటకు తెలియలేదు. ఆ నిర్ణయాలేమిటన్నదానిపై.. స్పష్టత లేదు. సాధారణంగా.. పరిపాలన పూర్తి పారదర్శకంగా ఉండాలని కోర్టులు చెబుతూ ఉంటాయి. రహస్య జీవోలు ఉండకూడదని స్పష్టం చేస్తూంటాయి. అయితే ప్రభుత్వాలు మాత్రం.. పదుల సంఖ్యలో ఒకే సారి ఈ రహస్య జీవోలు విడుదల చేస్తూ… పారదర్శక పాలనను అవహేళన చేస్తున్నాయి.