తెలంగాణ కాంగ్రెస్ లో వర్గపోరు కొత్త అంశమేమీ కాదు. ముఖ్యంగా, మాజీ మంత్రి డీకే అరుణ, సీనియర్ నేత జైపాల్ రెడ్డి వర్గాల మధ్య దూరం ఇంతకింతకీ పెరుగుతోంది. నిజానికి, ఇద్దరి నేతల మధ్యా వర్గ పోరు ఎప్పట్నుంచో ఉంది. కానీ, తాజాగా పార్టీలోకి కొంతమంది నేతలను జైపాల్ రెడ్డి ఆహ్వానిస్తూ ఉండటంతో, తనను రాజకీయంగా దెబ్బకొట్టేందుకే ఆ వర్గం ప్రయత్నిస్తోందని అరుణ భావించడంతో రాజకీయ వేడి పెరిగింది. ఈ క్రమంలో డీకే అరుణ వర్గీయులంతా తాజాగా ఓ సమావేశం నిర్వహించుకోవడం ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చనీయం అవుతోంది.
పాలమూరు జిల్లాలోని ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నేతలతోపాటు, ప్రముఖులు ఎంపీ నంది ఎల్లయ్య, మల్లు రవి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక, జిల్లాలోని చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి ఈ సమావేశానికి రాలేదట! అయితే, డీకే వర్గీయులంతా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశం… జైపాల్ వర్గం చేస్తున్న రాజకీయమే. వారికి అనుకూలంగా ఉండేవారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారనీ, తద్వారా పార్టీ భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందనే అంశాన్ని పట్టించుకోవడం లేదని అరుణ అభిప్రాయపడ్డట్టు సమాచారం. కేవలం తనను రాజకీయంగా దెబ్బ తీయడం కోసమే టీడీపీ, భాజపాల నుంచి కొంతమందిని జైపాల్ పార్టీలోకి వలసల్ని ప్రోత్సహిస్తున్నారనీ, దీని వల్ల పార్టీలో వర్గపోరు పెరుగిపోతుందన్న అంశాన్ని మరోసారి అధినాయకత్వానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
ఈ ఫిర్యాదుపై పార్టీ నాయకత్వం సానుకూలంగా స్పందించకపోతే తమదారి తాము చూసుకుంటామని డీకే వర్గీయులు కొంతమంది అభిప్రాయపడ్డట్టు సమాచారం. అంటే, డీకే వెర్సెస్ జైపాల్ వర్గపోరు ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. భాజపా నేత నాగం జనార్థన్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్న దగ్గర్నుంచే ఈ పోరు తీవ్రత పెరిగింది. ఆయన్ని చేర్చుకోవడం అరుణ వర్గానికి ఏమాత్రమూ ఇష్టం లేదు. అందుకే ఢిల్లీ వెళ్లి మరీ నాగం చేరికను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. కానీ, అధినాయకత్వం పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు టీడీపీలో మిగులున్న ఒకరిద్దరు నాయకుల్ని కూడా కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు జైపాల్ పావులు కదుపుతున్నారనీ, అదే జరిగితే పార్టీలో తన పట్టు తగ్గిపోతుందని డీకే అరుణ భావిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా తన బలం ఇదీ అని పార్టీ అధినాయకత్వానికి సంకేతాలు పంపడమే అరుణ వ్యూహంగా కనిపిస్తోంది.