తెలుగు టీవీ చానళ్లలో ఎన్టీవీ, టీవీ 5, సీవీఆర్ న్యూస్ చానల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇవి అందరికీ తెలుసు. కానీ వీటి యజమానుల గురించి.. వారి వ్యవహారాల గురించి హై ప్రోఫైల్ సర్కిళ్లలోనే తెలుసు. వీరంతా జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీలో సభ్యులు. ఆ సొసైటీని అడ్డం పెట్టుకుని చాలా మంది కోట్లకు కోట్లు కూడబెట్టుకున్నరన్న ప్రచారం ఉంది. ఇప్పుడు ఆ సొసైటీ.. జూబ్లిహిల్స్ క్లబ్ విషయంలో ఈ చానళ్ల ఓనర్ల మధ్య ఒకరికి ఒకరికి పడటం లేదు.
ప్రస్తుతం జూబ్లిహిల్స్ సొసైటీ .. టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడు కుమారుడి చేతుల్లో ఉంది. ఇటీవల ఆయన సీవీఆర్ న్యూస్ చానల్, ఎన్టీవీ ఓనర్లను సొసైటీ నుంచి తొలగించారు. వారు కోర్టుకెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఇప్పుడు క్లబ్ నుంచి టీవీ 5 ఓనర్ ని.. ఆయన కుమారుడితో పాటు మద్దతుగా ఉండేవారిని తొలగిస్తున్నానని సీవీఆర్ ప్రకటించారు. ఇప్పుడు వారు కూడా కోర్టుకెళ్తారు. ఈ రచ్చతో టీవీ చానళ్ల యజమానులు ..సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. మీడియా అంటేనే బయాస్డ్ న్యూస్ అన్నట్లుగా మారిపోయిన ఈ ముగ్గురి వ్యవహారంలో బాగానే సెటైర్లు పడుతున్నాయి.
ఓ సొసైటీ.. ఓ క్లబ్ మెంబర్ షిప్‌లు.. ఆధిపత్యం కోసం వందల కోట్ల ఆస్తిపరులైన వీరు.. సమాజంలో తమ పేరు ప్రతిష్టలను కూడా పణంగా పెట్టి ఎందుకు పోరాడుతున్నారన్నది చర్చనీయాంశమవుతోంది . చెప్పేది అందరికీ నీతులు.. కానీ చేస్తోంది మాత్రం వేరు. అసలు మొత్తం రెండు గ్రూపుల్ని పక్కన పెట్టి ప్రభుత్వం.. అ సొసైటీ… క్లబ్‌లలో ఏం జరుగుతుదో తేల్చాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.