జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఈనెల 7వ తేదీన చనిపోవడంతో ఆయన స్థానంలో ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సయీద్ మృతికి వారం రోజులు సంతాపం దినాలుగా పాటిస్తుండటంతో ఆమె ఇంతవరకు ప్రమాణస్వీకారం చేయలేదు. కానీ ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ రంగ ప్రవేశం చేసి, మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బేషరతు మద్దతు ఇస్తామని ప్రకటించింది. ఆమెకి సానుభూతి తెలిపే మిషతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా శ్రీనగర్ వచ్చి ఆమెతో మంతనాలు సాగించారు. ఆ తరువాత మెహబూబా ముఫ్తీ కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకొంటున్నట్లు వార్తలు వచ్చేయి.
బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కూడా పిడిపి నేతలతో చర్చలు కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ పిడిపి ఎంతకీ తన వైఖరి స్పష్టం చేయకపోవడంతో, “మా అభిప్రాయం చాల స్పష్టంగా పిడిపికి తెలియజేసాము. ఇక ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత పిడిపిపైనే ఉంది. ఈ విషయంలో ఇక మేము చెప్పవలసినది ఏమీ లేదు,” అని రామ్ మాధవ్ మీడియాకి తెలిపారు.
దానిపై పిడిపి సీనియర్ నేత డా.మెహబూబ్ బేగ్ మాట్లాడుతూ, “ముఫ్తీ సాబ్ మృతి చెందడంతో ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ చాలా కలత చెంది ఉన్నారు. ఆయన ఆమెకు కేవలం తండ్రి మాత్రమే కాదు…మార్గదర్శి, రాజకీయ గురువు కూడా. అందుకే ఆమె ఇంకా ఆ బాధ నుండి తేరుకోలేకపోతున్నారు. ఆమె తేరుకొని మళ్ళీ మన మధ్య రావడానికి కొంత సమయం పట్టవచ్చును. అందుకు ఎన్ని రోజులు పడుతుందో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేము. అయినా ప్రస్తుతం సంతాప దినాలు పాఠిస్తునాము కనుక ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం సబబు కాదు. మా పార్టీ ప్రజాభీష్టాన్ని మన్నించి బీజేపీతోనే కొనసాగుతుందని మాత్రం చెప్పగలను. మెహబూబా ముఫ్తీ తన తండ్రి అడుగుజాడలలోనే నడవాలనుకొంటున్నారు. కనుక తన తండ్రి నిర్ణయించిన ప్రకారం బీజేపీతోనే కలిసి ముందుకు సాగుతాము. మా రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఒకరికొకరం ఎటువంటి షరతులు విదించుకోలేదు. దీనిపై మీడియాలో వస్తున్న వార్తలేవీ నిజం కాదు,” అని అన్నారు.
పిడిపి, బీజేపీ కలిసి పనిచేసేందుకు ఎటువంటి షరతులు విధించుకోలేదని ఆయన పైకి చెపుతున్నప్పటికీ, ఇరు పార్టీల మధ్య రాజీ కుదిరింది కనుకనే ఆయన ఇప్పుడు బీజేపీతో కలిసి పనిచేస్తామని మీడియా ముందుకు వచ్చి చెపుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీతో కూడా ఇంకా సమాంతరంగా చర్చలు సాగించడానికే సంతాపం పేరిట ఆమె మరికొన్ని రోజులు గడువు తీసుకొంటున్నట్లు భావించవలసి ఉంటుంది. బేషరతుగా మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీని కాదని షరతులు విధిస్తున్న బీజేపీ మద్దతు తీసుకోవలసిన అవసరం పిడిపికి లేదు. కానీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నందున, దానితో కొనసాగితే కేంద్రం నుండి ఇబ్బడిముబ్బడిగా నిధులు, సహాయ సహకారాలు లభించేఅవకాశం ఉంది. కనుకనే పిడిపి కాంగ్రెస్-బీజేపీల మధ్య ఊగిసలాడుతోంది. మరో మూడు నాలుగు రోజుల్లో మెహబూబా ముఫ్తీ ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.