ఇది వరకు తెలుగు సినిమా ఆడియో ఫంక్షన్ అనగానే.. ‘హైదరాబాద్‌లోనే జరుగుతుంది’ అని ఫిక్సయిపోయేవాళ్లు. రాష్ట్రం రెండు గా విడిపోయాక… ఆడియో ఫంక్షన్లకు ఆప్షన్లు పెరుగుతూ వచ్చాయి. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్… ఇలా ఎక్కడైనా వేడుకలు నిర్వహించొచ్చు. ఒక్కోసారి అన్ని చోట్లా ఆడియో విడుదల చేసి.. ‘అందరివాళ్లం’ అనిపించుకొంటున్నారు హీరోలు. కొంతమంది పాటల్ని ఎక్కడ రిలీజ్ చేయాలో తెలీక… ఆడియో రిలీజ్ ఫంక్షన్ లేకుండానే నేరుగా పాటల్ని మార్కెట్లో కి విడుదల చేయడం మొదలెట్టారు. ఖైదీ నెం.150 ఆడియో ఫంక్షన్ విషయంలోనూ ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంది.
చిరంజీవి 150వ సినిమా ఇది. అభిమానులు ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. చిరు రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా కాబట్టి, ఆడియో రిలీజ్ చేయాల్సిందే. అదీ భారీ ఎత్తున. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లూ చురుగ్గా సాగుతున్నాయి. అయితే ఈ ఫంక్షన్ ఎక్కడ చేయాలి? అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో ఓ చోట ఆడియో ఫంక్షన్ చేయాలని చిరు భావిస్తున్నాడట. చరణ్ అయితే `హైదరాబాద్`కే ఓటేస్తున్నట్టు వినికిడి. అయితే చిరు మాత్రం విజయవాడ, విశాఖపట్నం అయితే బాగుంటుందని భావిస్తున్నాడట. ఆడియో హైదరాబాద్ లోనూ, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆంధ్ర ప్రదేశ్‌లోనూ చేస్తే.. బాగుంటుందని చిరు వర్గీయులు సలహా ఇస్తున్నార్ట. ఆడియో ఫంక్షన్‌కి చిత్రసీమలోని ప్రముఖులు అందరినీ ఆహ్వానించాలని భావిస్తున్నాడు చిరు. వాళ్లందరి కోసం హైదరాబాద్‌కే ఫిక్సయ్యే అవకాశాలున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో ఆడియో ఫంక్షన్‌కి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.