ఇదిగో కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరుతున్నారని మీడియాకు సమాచారం ఇచ్చారు. పదిన్నరకు ప్రత్యేక విమానంలో వెళ్తారని తొమ్మిదింటికి చెప్పారు. అంటే మొత్తం రెడీ చేసుకుని ఉంటారు. అందరూ వెళ్లిపోయి ఉంటారనుకున్నారు. కానీ కేసీఆర్ వెళ్లలేదు. ప్రగతి భవన్‌లోనే ఉన్నారు . ఇవాళ లేదా.. రేపు వెళ్తారని చెబుతున్నారు. అంటే క్లారిటీ లేదు. ఉన్న పళంగా బయలుదేరుతారని చెప్పి.. మళ్లీ ఆగిపోవడం.. మళ్లీఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి ఏర్పడటంతో టీఆర్ఎస్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. కేసీఆర్‌లో ఇంత గందరగోళం ఎప్పుడూ చూడలేదని అంటున్నారు.
కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు అంటే పంటి నొప్పి కోసం అనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. పంటికి ఓ ప్రత్యేక వైద్యుడ్ని కేసీఆర్ ఢిల్లీలో సంప్రదిస్తూ ఉంటారు. ఆయన వద్దే చికిత్స తీసుకుంటారు. అందుకే ఢిల్లీకి వెళ్తున్నారని అంటారు.అయితే ఇది ఓ రకంగా బిజారే కారణం. అసలు కారణం వేరే ఉంటుందని భావిస్తున్నారు. కేసీఆర్ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారని ఆయనతో భేటీ అవ్వాలనుకుంటున్నారని ఆయన అపాయింట్మెంట్ కోసమే చూస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మోదీ అపాయింట్ మెంట్ ఖరారయ్యే చాన్స్ ఉండటంతో ప్రత్యేక విమానాన్ని ట్రాక్ మీదకు తెచ్చారని.. కానీ తర్వాత రెండు రోజుల వరకూ చాన్స్ లేదని సమాచారం రావడంతో హైదరాబాద్‌లోనే ఉండిపోయారని అంటున్నారు. కేసీఆర్ రాజకీయం ఇంత గందరగోళం.. భయంభయంగా ఉండటం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. టీఆర్ఎస్ శ్రేణుల్లోనూ కాన్ఫిడెన్స్ తగ్గిపోయేలా చేస్తోంది. సరైన సమాచారం కూడా ప్రజలకు చేరవేయలేని పరిస్థితి ఎందుకన్న వాదన వినిపిస్తోంది.