కొన్ని కాంబినేషన్లు చూడ్డానికీ వినడానికి బాగుంటాయి. కానీ వర్కవుట్ అవ్వడంలో కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. నందమూరి బాలకృష్ణ – తేజ కాంబినేషన్ కూడా అట్టాంటిదే. ఇద్దరి వర్కింగ్ స్టైల్ వేరు. ఇద్దరి నేపథ్యాలు వేరు. కాబట్టి… ఈ కాంబో చూడ్డానికి ‘వామ్మె’ అనిపించేలా ఉన్నా.. వర్కవుట్ అవ్వడంలో కొన్నిఇబ్బందులు తలెత్తడం సహజం. ఇప్పుడు అదే జరుగుతోంది. ‘ఎన్టీఆర్’ బయోపిక్ మార్చిలో మొదలైపోతుందన్నారంతా. బాలయ్య ఇదే మాట చెప్పాడు. కానీ.. తేజ వెంకీ సినిమాతో బిజీ అయిపోయాడు. బాలయ్య కూడా ఎన్టీఆర్ ప్రాజెక్టుని పక్కన పెట్టి మరో సినిమా చేసుకునే మూడ్లో ఉన్నాడు. దానికి కారణం… ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి కాస్ట్ అండ్ క్రూ ఇంకా సెట్టవ్వకపోవడమే.
తేజకి కొత్త వాళ్లతో ప్రయోగాలు చేయడం ఇష్టం. పైగా.. తన సినిమా అంటే, హీరోల దగ్గర్నుంచి చిన్నా చితకా కాస్టింగ్ వరకూ ఏరి కోరి మరీ ఎంచుకుంటాడు. `ఎన్టీఆర్` విషయంలో బాలయ్య ఆ అవకాశం ఇవ్వడం లేదని తెలుస్తోంది. ప్రతీ క్యారెక్టరూ తను అనుకున్న విధంగానే ఉండాలని, తాను కోరుకున్న నటీనటులే తెరపై కనిపించాలని చెబుతున్నాడట. దాంతో కాస్టింగ్ సంగతి వదిలేశాడు తేజ. అంతేకాదు.. స్క్రిప్టు విషయంలో తేజ జోక్యమేదీ లేదు. ఆల్రెడీ పూర్తయిన స్క్రిప్టు తేజ చేతిలో పెడతారంతే. దాన్ని ఆయన డైరెక్ట్ చేయడమే. అందుకే.. ఈ సినిమా విషయంలో తేజ పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వడం లేదని తెలుస్తోంది.
బాలయ్య మూడ్ ఒక్కోసారి ఒక్కోలా ఉంటోందని, ఓ క్షణంలో ‘ఎన్టీఆర్’ సినిమా మొదలెట్టాల్సిందే అని తొందర పడుతుంటాడని, మరోసారి మరో సినిమాపై ఆలోచిస్తుంటాడని.. అందుకే.. తేజ ‘ఎన్టీఆర్’ సినిమాకి సంబంధించిన వ్యవహారాల్లో దూరంగా ఉన్నాడని, తన దృష్టంతా వెంకీ సినిమాపై ఫోకస్ చేశాడని, బాలయ్య ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్లి.. ‘స్టార్ట్ కెమెరా యాక్షన్’.. చెప్పడానికే డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది. సో.. ఈ సినిమా ఇంకా మొదలే కాలేదు. అప్పుడే దర్శకుడిదీ, కథానాయకుడిదీ చెరో దారి అయిపోయిందన్నమాట.