బాహుబలి తరవాత అంత క్రేజ్ తెచ్చుకుంటున్న చిత్రం… ‘సైరా నరసింహ రెడ్డి’. దాదాపు 200 కోట్లతో తెరకెక్కుతున్న చిత్రమిది. సాంకేతిక హంగులు కూడా బాగానే వున్నాయి. చిరు పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్.. ఈ సినిమాపై అంచనాలు బాగా పెంచేసింది. తొలి స్వతంత్ర సమరయోధుడు ‘ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి’ కథ ఇది. చరిత్ర పుస్తకాల్లో దొరికిన నిజాలకు కాస్త కల్పన జోడిస్తున్నారు. నరసింహ రెడ్డిని బ్రిటిష్ ప్రభుత్వం వురి తీసింది. కోట గుమ్మానికి తల వేలాడగట్టింది. చరిత్ర ప్రకారం ఈ కథ అక్కడితో ఆగిపోవాలి. స్క్రిప్ట్ లో కూడా అదే రాసుకున్నారు. అయితే చిత్ర బృందం ఇప్పుడు తర్జన భర్జనల్లో పడింది. నరసింహ రెడ్డి చావుతో ఈ కథ ముగించాలా? లేదంటే.. నరసింహ రెడ్డి స్ఫూర్తి తో… ఎవరెవరు తిరుగుబాటు చేశారు? స్వతంత్ర పోరాటంలో ఈ నరసింహ రెడ్డి అంకం ఎంతవరకూ దోహదం చేసింది? అనేవీ చూపించాలా? అనే మీమాంస లో వున్నారు. యాంటీ క్లైమాక్ తెలుగు ప్రేక్షకులకు రుచించదు. అందుకే దానికి కొనసాగింపుగా కొన్ని పాజిటివ్ సీన్లు రాసుకుంటే ఎలా ఉంటుంది? ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి తరవాత పుట్టుకొచ్చిన అల్లూరి లాంటి విప్లవ వీరుల్ని తెరపై మాంటేజ్ షాట్ల లో చూపిస్తే ఎలా ఉంటుంది? అనే విషయాలపై లోతుగా చర్చ నడుస్తోంది. మరి చివరకి ఏం తేలుతుందో చూడాలి.