ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఇంకా ఎన్నేళ్ళ తరువాత మొదలవుతాయో తెలియదు కానీ దాని గురించి రోజుకొక కొత్త కధ వినబడుతోంది. తాజాగా రాజధానిలో భవనాలకు డిజైన్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన జపాన్ కి చెందిన మాకి అండ్ అసోసియేట్స్ సంస్థ రూపొందించిన డిజైన్లు విద్యుత్ ప్లాంట్ చిమ్నీలలాగ ఉన్నాయని విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలోపడింది. ఈ పని చేపట్టడానికి పోటీ పడిన మూడు సంస్థలు సమర్పించిన రాజధాని భవనాల డిజైన్లను ఆరు మంది నిర్మాణ రంగ నిపుణులతో కూడిన బృందం క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే జపాన్ సంస్థను ఖరారు చేసింది. కానీ మాకి సంస్థ సమర్పించిన డిజైన్లపై విమర్శలు రావడంతో ఆ డిజైన్లు బాగోలేదని, వాటిని మార్చి మళ్ళీ కొత్త డిజైన్లు సమర్పించాలని ప్రభుత్వం కోరుతోంది. అంతే కాకుండా ఈ పని కోసం ఆ సంస్థ కోట్ చేసిన రూ.89 కోట్లు ఫీజుని కూడా తగ్గించాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది.
రాజధానిలో నిర్మించబోయే రాష్ట్ర శాసనసభ, హైకోర్టు, సచివాలయం, రాజ్ భవన్, ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలు అన్నీ కూడా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉంటూనే అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. మాకి సంస్థ జపాన్ కి చెందిన కనుక దానికి మన సంస్కృతి గురించి తెలియదు. కనుక ఆ భవనాలు ఏవిధంగా డిజైన్ చేయాలో సూచించేందుకు మన దేశానికి చెందిన 8మంది అర్కిటెక్చర్ నిపుణులతో కూడిన ఒక బృందాన్ని సి.ఆర్.డి.ఎ. ఏర్పాటు చేసింది. వారి సలహాలు, సూచనల మేరకు మాకి సంస్థ రాజధాని భవనాలను డిజైన్ చేయాలని ప్రభుత్వం ఆశిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారితో మే 9న సమావేశం కాబోతున్నారు. వారితో చర్చించిన తరువాత ఆయన మాకి సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యి దీని గురించి చర్చిస్తారు. ఒకవేళ మాకి సంస్థ ఆయన సూచనలకు అంగీకరిస్తే సరే సరి లేకుంటే దానిని పక్కన పెట్టి వేరొక సంస్థని ఆహ్వానించవచ్చునని సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఏదో ఒక సంస్థ ద్వారా రాజధాని భవనాల డిజైన్లను సిద్దం చేసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజధాని అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని ముఖ్యమంత్రి గట్టిగా కోరుకొన్నారు కనుక సింగపూర్ సంస్థ చేత మాష్టర్ ప్లాన్ గీయించారు బాగానే ఉంది. అందులో తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా రాజధాని భవనాల డిజైన్లను సూచించేందుకు మన దేశానికే చెందిన 8మంది ప్రముఖ అర్కిటెక్చర్ నిపుణులకి బాధ్యత అప్పజెప్పినప్పుడు, మళ్ళీ అదే పనిని మాకి సంస్థకి అప్పజెప్పడం ఎందుకో తెలియదు. మన దేశానికి, రాష్ట్రానికి చెందిన సివిల్ ఇంజనీర్లు, అర్కిటెక్చర్ నిపుణులు దేశ విదేశాలలో మంచి పేరుప్రతిష్టలు సంపాదించుకొన్నారు. వారిని కాదని మన సంస్కృతి, సంప్రదాయాలు, అవసరాలు, వాతావరణ పరిస్థితుల గురించి బొత్తిగా అవగాహన లేని జపాన్ సంస్థకి ఎందుకు ఈ పని అప్పగించాలనుకొంటోందో తెలియదు కానీ దాని వలన ఇటువంటి విమర్శలు, ఊహించని సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. దాని వలన రాజధాని నిర్మాణం ఇంకా ఆలస్యం జరుగుతూనే ఉంటుంది. ఈలోగా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారినా, ఎన్నికలు వచ్చేసినా అప్పుడు రాష్ట్ర ప్రజలకు తెదేపా సంజాయిషీలు చెప్పుకోకతప్పదు. ఒకవేళ వారు దాని సంజాయిషీలతో సంతృప్తి చెందకపోతే ఎన్నికలలో ఓటమి తప్పదు. కనుక స్వదేశీ నిపుణులతో, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వీలయినంత త్వరగా రాజాధాని నిర్మాణ పనులు మొదలుపెడితే తెదేపాకే మంచిది.