తెలంగాణలో కొత్తగా ఎన్ని జిల్లాలు ఏర్పాటవుతాయనేదానిపై ఓ స్పష్టత వచ్చిందనుకుంటే కొత్త కొత్త ప్రతిపాదలను వస్తున్నాయి. వాటిని కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తున్నారు. మొత్తం మీద 14 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. అంటే ఇప్పుడున్న జిల్లాల సంఖ్య 10 నుంచి 24 కు పెరగుతుందన్న మాట.
ఇది ఫైనల్ అనుకునే సమయంలో ఇంకో ప్రతిపాదన. నిర్మల్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలంటూ అక్కడి తెరాస నేతలు ప్రతిపాదించారు. దీన్ని కూడా పరిశీలించాలని కేసీఆర్ హుకుం జారీ చేశారని తెలుస్తోంది.
ఆదిలాబాద్ జిల్లాను రెండుగా విభజించాలని మొదట నిర్ణయించారు. మంచిర్యాల కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు కొమురం భీమ్ పేరు పెట్టాలని నిర్ణయించారు. మరి నిర్మల్ జిల్లా సంగతి ఏమిటనేది అంతుపట్టడం లేదు.
ఇప్పటి వరకూ నిర్ణయించిన 24 జిల్లాల విషయంలోనూ చాలా వరకు అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లాలో ఉండేలా చూశారు. అలాగే వీలైనంత వరకూ మండలం మొత్తం ఒకే నియోజకవర్గంలో ఉండేలా పునర్విభజన చేశారు. కానీ ఇప్పుడు ఒక్కో నియోజకవర్గం రెండు మూడు జిల్లాల్లో ఉండే పరిస్థితి కనిపిస్తుంది.
ఇప్పటి వరకు మండలాలు, జిల్లాలపై తయారైన ముసాయిదా ప్రకారం, ఒకటీ రెండు కాదు, ఏకంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మూడేసి జిల్లాల పరిధిలో ఉంటాయి. అంటే ఆ ఎమ్మెల్యేలు మూడు జిల్లాల్లో తిరగాలన్న మాట. మరో ఏడు నియోజకవర్గాలు రెండేసి జిల్లాల పరిధిలో ఉంటాయి. అసలు ఈ జిల్లాల విభజన ప్రక్రియలో శాస్త్రీయత అనేదే లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇలా ఒక్కో నియోజకవర్గం రెండు మూడు జిల్లాల్లో ఉంటుందంటే విపక్షాల విమర్శ నిజమేనేమో అనిపిస్తుంది.
పద్నాలుగేళ్ల తర్వాత తెలంగాణలో ఆందోళనలు రాస్తారోకోలు ఉండవనుకున్న ప్రజలకు నిరాశే కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్తగా జిల్లా ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు తీవ్రమయ్యాయి. వరంగల్ జిల్లా జనగామలో ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వాహనాలపై దాడులు జరిగాయి. బస్సులను తగలబెట్టారు. విధ్వంసం సృష్టించారు. అంతకు ముందు అదే జిల్లాలోని మహబూబా బాద్ లోనూ ఆందోళన పేరుతో విధ్వంసం జరిగింది. ముందు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దృశ్యం కనిపించే అవకాశం ఉంది. మళ్లీ ఆందోళనలు బంద్ లు రాస్తారోకోలు మొదలైతే ప్రజలకు ఇబ్బందులు తప్పవు. జిల్లాల విభజనతో పరిపాలన సౌలభ్యం సంగతేమో గానీ ప్రజలకు మాత్రం పాట్లు తప్పేలా లేదు.