ఇప్పటికి ఆరు జాబితాలో విడుదలయ్యాయి. ఒక జాబితాలో పేరున్న వారికి మరో జాబితాలో షాకిస్తున్నారు. ఎంపీ అభ్యర్థుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా మారుస్తున్నారు. మళ్లీ తర్వాత జాబితాలో వారికి మార్పులు తప్పడం లేదు. టిక్కెట్లు ప్రకటించిన వారు కూడా దండం పెడుతున్నారు. ప్రకటించని వారు కూడా అదే పని చేస్తున్నారు. కొంత మంది ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకుని మీకో దండం అంటున్నారు. జాబితాలో ఇంత గందరగోళం ఎందుకు చేసుకుంటున్నారంటే.. ఇదో వ్యూహం అని వైసీపీ పార్టీ నేతలు సర్ది చెప్పుకుంటున్నారు.
6 జాబితాల్లో ఎవరికైనా గ్యారంటీ ఉందా ?
ఆరు జాబితాలు కలిపితే బదిలీలు పోను దాదాపుగా 30 మంది వరకూ అభ్యర్థులకు టిక్కెట్లు నిరాకరించారు. వీరిలో చాలా మంది టిక్కెట్ అవసరం లేదనుకున్నవారు. మిగిలిన వారు.. తమను కాదని వేరే వారికి టిక్కెట్ ఇచ్చే ధైర్యం ఉందా అని సైలెంట్ గా ఉంటున్నారు. ఎన్నికలు దగ్గరకు రాగానే తమనే బతిమిలాడి టిక్కెట్ ఇస్తారని వారనుకుంటున్నారు. ప్రస్తుతం సమన్వయకర్తలుగా నియమిస్తున్న వారిలో సగం మందికి టిక్కెట్ డౌటేనని వైసీపీ వర్గాలే బహిరంగంగా చెప్పుకుంటున్నాయి. అందుకే నియమితులైన వారిలోనూ అంత ఉత్సాహం కనిపించడం లేదు.
జాబితాల కసరత్తును కామెడీగా తీసుకున్న క్యాడర్
జగన్ రెడ్డి చేస్తున్న జాబితాల కసరత్తును క్యాడర్ కూడా కామెడీగా తీసుకుంది. పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయడం అంటే… సొంత ఈగోలతో అత్యంత బలహీన అభ్యర్థిని ఎంపిక చేసి.. బలమైన పార్టీ నేతల్ని కించ పర్చడం అన్నట్లుగా ఉందని సెటైర్లు వేసుకుంటున్నార. అందుకే ఎక్కువ మంది సైలెంట్ అయిపోతున్నారు. ఇప్పటి వరకూ మార్పు చేర్పులు చేసిన అభ్యర్థుల్లో పది మందికి అయినా గెలిచే సామర్థ్యం ఉందా అని చర్చించుకుంటున్నారు. రఘురామకృష్ణరాజుపై కృష్ణంరాజు సతీమణినో.. గోకరాజు గంగరాజు కుటుంబసభ్యులనో పెడదామనుకుంటే.. అందరూ దండం పెట్టేశారు. చివరికి కాకినాకు చలమలశెట్టి సునీల్ ను కూడా బతిమాలి పోటీ పెట్టారని అంటున్నారు. ఇంత దుర్భరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో వైసీపీ నేతలకు అర్థం కావడంలేదు.
సైలెంట్ గా కసరత్తు చేసుకుని ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ప్రకటించుకోవచ్చుగా !
అదేదో కొంపలు మునిగిపోయినట్లుగా.. రోజువారీ కసరత్తు జరిపి.. జాబితాలను ప్రకటిస్తారు. ఏ జాబితాలోనూ పది మందికి మించి పేర్లు ఉండటం లేదు. అంత అవసరం ఏముందని.. అంతర్గతంగా కసరత్తు చేసుకుని ప్రకటన చేసుకోవచ్చు కదా అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. బదిలీ చేసిన వారు నియోజకవర్గాల్లో కుదురుకోలేక.. మళ్లీ తమ సొంత చోటనే టిక్కెట్ కేటాయించాలని ఒత్తిళ్లు ప్రారంభిస్తున్నారు. ఇవన్నీ వైసీపీలో గందరగోళంగా మారింది.. వైసీపీని చిందరవందర చేసుకోవడం కూడా వ్యూహామేనని వైసీపీ నేతలు సర్ది చెప్పుకుటున్నారు.