రాఖీ పౌర్ణమి సందర్భంగా అధికార, ప్రతిపక్షం అనే తేడా లేకుండా పండగ వాతావరణం కనిపించింది. ఆయా పార్టీల మహిళా నేతలు వెళ్లి తమ అధినేతలకు రాఖీలు కట్టడం సంప్రదాయమే. వారు ఏ పార్టీలో ఉంటే వారికి కడతారు. అందులో విశేషం ఏమీ లేదు. పార్టీలతో సంబంధం లేకుండా సొంత రాఖీలు కట్టడానికి వచ్చేది తోబుట్టువులే. ఉన్నత స్థానాల్లో ఉన్న వారి గురించి అయితే మరింత ఎక్కువ ఆసక్తి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ వస్తే ఎక్కువ మమంది ఆసక్తి చూపేది కవిత- కేటీఆర్ , షర్మిల – జగన్ ల వేడుకలు ఎలా జరుపుకున్నారనే. నిజంగానే వారి అనుబంధం అలాంటిది మరి.
రక్షాబంధన్ రోజు కల్వకుంట్ల కవిత ప్రగతి భవన్కు వెళ్లి అన్న కేటీఆర్కు రాఖీ కట్టి అశీర్వాదం తీసుకుంటారు. కేటీఆర్ కూడా సోదరికి తానున్నాననే భరోసా ఇచ్చే బహుమతి కూడా ఇస్తారు. ఇక్కడ బహుమతిని ఖరీదుతో కొలవరు ప్రేమ, ఆప్యాయత, భరోసాతో కొలుస్తారు. ఆ విషయంలో సోదరి కవితను కేటీఆర్ ఎప్పుడూ నిరాశపర్చలేదు. సోదర, సోదరీమణుల అనుబంధం అలా ఉంటుంది. ఈ ఏడాది కూడా అంతే కొనసాగింది. ప్రగతి భవన్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా సాగాయి.
కేటీఆర్-కవితల్లానే ఏపీలో పొలిటికల్ సెలబ్రిటీ అన్నాచెల్లెళ్లు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన చెల్లెలు షర్మిల. వీరి మధ్య అనుబంధాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. అన్న కోసం వేల కిలోమీటర్లు నడిచిన గుండె ధైర్యం ఆమెది. వారి అనుబంధానికి సాక్ష్యం వారు జరుపుకునే రాఖీ వేడుకలే . ప్రతీ సంవత్సరం రాఖీ పండుగ రోజు …జగన్ నివాసానికి వెళ్లి రాఖీ కడతారు. జగన్ కూడా షర్మిలకు తాను రక్షణగా ఉన్నాననే భరోసాను బహుమతిగా ఇస్తారు. కానీ ఈ సారి మాత్రం షర్మిల తాడేపల్లికి వెళ్లలేదు. సోషల్ మీడియాలో అందరితో పాటు అన్నకూ శుభాకాంక్షలు చెప్పారు. దీంతో వైసీపీ అభిమానులు చిన్నబుచ్చుకోాల్సి వచ్చింది. అసలు చెప్పకపోతే బాగుండు కదా అన్నది వారి వేదన. వైసీపీలో మహిళా నేతలు ఎక్కువ మంది జగన్కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి కానీ వీటిలో షర్మిల రాఖీ కట్టిన ఫోటో మాత్రం ఈ సారి మిస్సయింది.