ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. కానీ… ఆయన పర్యటనకు సంబంధించి ప్రతి విషయంలోనూ.. గందరగోళమే నెలకొంది. ఆయన పర్యటన వ్యక్తిగతమా..? అధికారికమా ..? అనే దాని దగ్గర్నుంచి సీఎంతో పాటు.. ఎవరెవరు వెళ్లాలి..? ఎవరెవరు వెళ్తారు..? అనే దానిపై.. చివరి వరకూ ఎటూ తేల్చుకోలేకపోయారు. దీనికి సంబంధించి… జీవోలు చివరి క్షణం వరకూ బయటకు రాలేదు. అమెరికా పర్యటనకు వెళ్లే సమయంలో… హడావుడిగా.. కొన్ని ఆదేశాలు మాత్రం జారీ చేశారు. చివరికి.. జగన్మోహన్ రెడ్డితో పాటు… రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్, గెలిచిన తర్వాత ప్రత్యేకంగా ఓఎస్డీగా నియమించుకున్న పీవీ రమేష్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వెళ్లారు.
సాధారణంగా.. ముఖ్యమంత్రి పర్యటన అంటే… దానికో ప్రక్రియ ఉంటుంది. ముందుగా.. సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. వారు ఎవరెవరు వెళ్తున్నారో క్లియరెన్స్ ఇస్తారు. అలా క్లియరెన్స్ ఇస్తే సమాచారం… ముఖ్యమంత్రి వెళ్లే దేశాల్లో రాయబార కార్యాలయాలకు వెళ్తుంది. అక్కడ వారు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. కానీ.. జగన్మోహన్ రెడ్డిది మొదటి నుంచి వ్యక్తిగత పర్యటన అని చెబుతూ వచ్చారు. అందుకే.. కేంద్రానికి ఎలాంటి సమాచారం పంపలేదు. చివరకు… ఆ పర్యటనలో కొన్ని అధికారిక సమావేశాలు నిర్వహించాలని అనుకున్నారేమో కానీ… కేంద్రానికి సమాచారం పంపారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అమెరికాకు వెళ్లేందుకు పర్మిషన్ అడిగారు. అయితే.. పీవీ రమేష్ రిటైర్ అయ్యారు. ఏ హోదాతో తీసుకెళ్తారో.. క్లారిటీ లేదు. ఇదే విషయం… కేంద్రానికి సంబంధించిన అధికారులు అడగడంతో.. ఉన్న పళంగా ఆయనను… సీఎం జగన్ కు అదనపు ప్రత్యేక కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇంత గందరగోళం నడుమ… జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో పాటు… అనుమతి పొందిన వారితో అమెరికా విమానం ఎక్కారు. అయితే.. అక్కడ జగన్ కు సంబంధించి ఒకే కార్యక్రమం గురించి బయటకు తెలిసింది. వైసీపీ కార్యకర్తల సమావేశం మాత్రం గురించి మాత్రమే ప్రచారం జరుగుతోంది. ఆయన అక్కడ అధికారిక సమావేశాలు ఎవరెవరితో నిర్వహిస్తారన్నదానిపై మాత్రం… ఎలాంటి సమాచారం వెల్లడించడం లేదు. దానిపై ఎలాంటి ప్రణాళికలు లేవని… అమెరికాలో పరిస్థితుల్ని బట్టి భేటీలుంటాయని.. చెబుతున్నారు. ఓ రకంగా.. ఇదీ ప్రణాళికా లోపమే.