కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించబోతున్నారని.. పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శిస్తాని సోమవారం ఓ వైపు కేబినెట్ భేటీ జరుగుతున్న సమయంలోనే లీక్ ఇచ్చారు. వెంటనే వరంగల్ అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. తీరా కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత.. అసలు విషయం మెల్లగా చెప్పారు. వరంగల్ వెళ్లేది కేసీఆర్ కాదని.. మంత్రుల బృందమేనని సమాచారం ఇచ్చారు. దీంతో ఆశ్చర్యపోవడం అధికారుల వంతయింది.
అనివార్య కారణాల వల్ల కేసీఆర్ రావడం లేని.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో పాటు జిల్లా మంత్రులు మరికొంతమంది మంత్రుల బృందం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవారం పర్యటించి పంట నష్టం అంచనా వేసి.. రైతుల కష్టాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తమ కష్టాలను తెలుసుకునేందుకు వస్తున్నాడని, ఏదైనా పరిహారం ప్రకటిస్తాడని ఆశ పడ్డ రైతులకు నిరాశ ఎదురయింది.
కేసీఆర్ వరంగల్ పర్యటన వాయిదా పడటం ఇదే మొదటి సారి కాదు. జనగామ కలెక్టరేట్ ఓపెనింగ్ ఇప్పటికి ఐదు సార్లు వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడానికి ముందు ఆయన టూర్ ఖరారైంది. కానీ వెళ్లేలోపు కోడ్ వచ్చింది . పైగా వరంగల్‌లోనే విజయగర్జన నిర్వహించాలనుకున్నారు. అన్నింటినీ వాయిదా వేశారు. కేసీఆర్ ఇటీవల జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. అవి కూడా వరుసగా సాగడం లేదు. ఆగితే సాగదు.. సాగితే ఆగవు అన్నట్లుగా ఉన్నాయి.