రాజకీయాల విషయంలో రజనీకాంత్ స్ట్రాటజీ ఏమిటో ఎవరికీ అంతుపట్టదు. `ఆ దేవుడు శాసిస్తే.. నేను పాటిస్తాను` అన్నట్టే సినిమా డైలాగులు చెబుతాడు. లేటైనా లేటెస్టుగా వస్తా – అంటూ ఊరిస్తాడు. కానీ.. అదెప్పుడో తేల్చడు. రజనీ వస్తాడు.. వస్తాడు అని ఎదురు చూసిన ఆయన వీరాభిమానులు కూడా `ఇంకెప్పుడు వస్తాడులే.. `అంటూ నీరుగారిపోయారు. ఈమధ్య అనారోగ్య కారణాల వల్ల రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదంటూ.. ఓ లేఖ చక్కర్లు కొట్టింది. `ఆ లేఖకీ నాకూ ఎలాంటి సంబంధం లేదు` అని రజనీ స్పష్టం చేసినా, రజనీ రాజకీయాల్లోకి ఎందుకు రావడం లేదన్న విషయంలో ఆయన అభిమానులకు ఓ క్లారిటీ వచ్చింది.
అయితే తాజాగా తన అభిమాన సంఘాల నాయకులతో రజనీ ఓ మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఈరోజు చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఈ సమావేశం జరిగింది. సమావేశ అనంతరం.. `త్వరలోనే నా నిర్ణయం చెబుతా` అంటూ ఓ డైలాగూ విసిరాడు. ఇదంతా.. రజనీ రాజకీయ రంగ ప్రవేశం కోసమే అన్నది అభిమానుల మాట. ఓ రకంగా… రజనీ మళ్లీ అభిమానుల్లో ఆశల్ని పెంచినట్టైంది. డిసెంబరు 12న రజనీకాంత్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రజనీ రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన ఓ ప్రకటన రావొచ్చేమో అన్నది అందరి ఆశ. ఈ మీటింగులు కూడా అందుకోసమే అని భావిస్తున్నారు. నిజానికి… తన ప్రతి పుట్టిన రోజుకి ఇలానే అభిమాన సంఘ నాయకుల్ని పిలిచి.. సమావేశం ఏర్పాటు చేయడం, భవిష్యత్ కార్యక్రమాల గురించి చర్చించడం, ఆయనకు అలవాటే. ఈ సమావేశం కూడా అలా రొటీన్ సమావేశాల్లో ఒకటన్నది కొంతమంది వాదన. రజనీ ఇలా మీటింగులు పెట్టినప్పుడల్లా అభిమానులు ఏదో ఆశించడం, ఆయన యధావిధిగా నిరాశ పరచడం మామూలే అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. కొంతమందైతే… రజనీ పొలిటికల్ ఎంట్రీకి ఇదే చివరి ఛాన్స్ అని, ఈసారి ఆయన రాకపోతే… ఇంకెప్పుడూ రాడని జోస్యం చెబుతున్నారు. మరి ఇందులో ఏది నిజం అవుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.