ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రాజమండ్రిలో జూన్ 22 న జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పుష్కరాలు ముగిసేవరకూ రాజమండ్రిలోనే వుంటానని ఆదివారంరాత్రి ఒక సభలో ప్రకటించారు. దీంతో ఇక్కడే కేబినెట్ సమావేశమని స్పష్టమై వసతి ఎలాగో తోచక అధికారులు తలలు పట్టుకున్నారు.
కేబినెట్ సమావేశానికి హాజరయ్యే మంత్రులేకాక అవసరాన్నిబట్టి తక్షణ సమాచారం ఇవ్వడానికి అందుబాటులో వుండవలసిన అధికారులు, సిబ్బంది సంఖ్య 150 వరకూ వుంటుంది. వారందరికీ రాజమండ్రిలో హొటల్ గదులులేవు. నాలుగ స్టార్ హొటళ్ళతో సహా అన్ని బడ్జెట్ హొటళ్ళలో 80 శాతం గదుల్లో ఇప్పటికే పుష్కరాల డ్యూటీకి వచ్చిన వారు వుంటున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు గెస్ట్ హౌస్ లు ఏవీ ఖాళీగా లేవు. ఈ స్ధితిలో కొన్నిగంటల కేబినెట్ సమావేశానికి వచ్చే మరో 150 మందికి వసతి కల్పించడం చిన్న విషయం కాదు.
ఒకరిద్దరు ఉన్నతాధికారులు ఈ సమస్యను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు దృష్టికి తీసుకువెళ్ళారు. ఆయన టెలిఫోన్ ద్వారా ముఖ్యమంత్రితో రాజమండ్రిలో కేబినెట్ సమావేశం సరేనదికాదు అని సూచించారని తెలిసింది.
విశాఖపట్టణం, లేదా విజయవాడలో కేబినెట్ మీటింగ్ పెట్టడమా లేక కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేయడమా అనే నిర్ణయం ముఖ్యమంత్రిదే. ఇంత రద్దీలో, ఇంతటి వత్తిడిలో కూడా పుష్కరాల కార్యస్ధానంలో కేబినెట్ సమావేశం కూడా నిర్వహించిన దక్షతగల నాయకుడన్న సంకేతాన్ని ప్రజలకు ఇవ్వడానికి రాజమండ్రిలోనే సమావేశం నిర్వహించే అవకాశం కూడా వుంది. ఏంచేస్తారన్నది అధికారులకు ఆదుర్ధా! మీడియాకు కుతూహలం!!