AM రత్నం గోపీచంద్ సినిమా “ఆక్సిజన్” వాయిదాలపై వాయిదాలు పడుతూ విడుదలకి నోచుకోవడం లేదు. ఆ మధ్య ఆడియో ఫంక్షన్ జరిగింది, ఇక అక్టొబర్ లో ఖచ్చితంగా విడుదల అయి తీరుతుందనుకున్నారు. కానీ నవంబర్ కి వాయిదా పడింది. నవంబర్ 10 అనుకుంటే ఆ డేట్ కూడా అయిపోయింది. తర్వాత నవంబర్ 17 అన్నారు కానీ అప్పటికి కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదు.
ఈ సినిమా దర్శకుడు AM రత్నం తనయుడు AM జ్యోతి కృష్ణ. 17 యేళ్ళ వయసు లోనే తండ్రి నిర్మిస్తున్న నట్పుకాగ (తెలుగులో చిరంజీవి స్నేహం కోసం ) సినిమాకి కథ అందించిన జ్యోతి కృష్ణ ఆ తర్వాత ఒక బిలింగ్వల్ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. నీ మనసు నాకు తెలుసు అనే ఆ సినిమా ఇంగ్లీష్ లో వచ్చిన “సెరండిపిటి ఆధారంగా రూపొందింది. అయితే అది ఫ్లాప్ అయి ఆయన కెరీర్ కష్టాల్లో పడింది. ఇప్పుడు ఆక్సిజన్ సినిమా కూడా దాదాపు 2 యేళ్ళ కిందే మొదలయినా దర్శకుడికి హీరోకి మధ్య వచ్చిన గొడవల కారణంగానే ఈ సినిమా ఆలస్యమయిందని తెలుస్తోంది. ఇక సినిమా పూర్తయిన తర్వాత బిజినెస్ సరిగా జరగలేదు. హీరోకి కానీ, దర్శకుడికి కానీ, నిర్మాతకి కానీ హిట్లు లేకపోవడమే కాక సినిమా ఆలస్యం అవడం కూడా బిజినెస్ జరగకపోవడానికి కారణమే.
మొత్తానికి ఈ ఆక్సిజన్ సినిమా కి ఆక్సిజన్ ఎప్పుడు అందుతుందో, నిర్మాత ఎప్పుడు హాయిగా గాలిపీల్చుకుంటాడో తెలియడం లేదని సినీ వర్గాలు అంటున్నాయి.