ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ బిల్లు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలను ఇబ్బందికి గురి చేస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో గతంలో ఇచ్చిన హామీ ని నిలబెట్టుకోక బీజేపీ, బీజేపీకి సాన్నిహిత్యంగా ఉంటూ తెలుగుదేశంలు ఇబ్బంది పడుతున్నాయి. రాష్ట్రాన్ని విభజించిన పాపం తమదే అయినా.. ఈ ప్రత్యేక హోదా అంశం ద్వారా తెలుగుదేశం, బీజేపీలను డిఫెన్స్ లోకి నెట్టుతోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో ఎదురుదాడే శరణ్యం అన్నట్టుగా బీజేపీ, తెలుగుదేశంలు కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్నాయి.
అయితే.. కాంగ్రెస్ తగ్గడం లేదు, గతంగతః ఇప్పుడేంటి? అన్నట్టుగా కాంగ్రెస్ ప్రైవేట్ బిల్లు అంశాన్ని అస్త్రంగా మార్చుకుని ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైన వ్యవహారాలను ప్రస్తావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అందులో ముఖ్యమైనది.. కేంద్రమంత్రి సుజనా చౌదరి ఇంకా రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయకపోవడం! ఇటీవలే ఆయన టర్మ్ ను ఎక్స్ టెండ్ చేసింది తెలుగుదేశం పార్టీ. మోడీ మంత్రి వర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున మంత్రిగా ఉన్న సుజనా పదవీ కాలం ముగియడంతో మొన్న తిరిగి ఎన్నికయ్యాడు. ఇటీవలే ముగిసిన ఆ ఎన్నికల అనంతరం అనేక మంది సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
అయితే సుజనా మాత్రం ఇంత వరకూ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయలేదట! ఇలా చేయకపోవడానికి, ప్రత్యేక హోదాపై తాము పెట్టిన ప్రైవేట్ బిల్లుకు సంబంధం ఉందని.. కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఒకవైపు మోడీ కేబినెట్ లో ఉండి.. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడలేడు, అలాగని ఓటింగ్ కు దూరంగా ఉంటే.. చెడ్డపేరు వస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి ప్రమాణస్వీకారోత్సవాన్ని వాయిదా వేసుకున్నాడట సుజనా చౌదరి. ఎన్నిక పూర్తి అయిన కొన్ని రోజుల తర్వాత ప్రమాణం చేయడానికి ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటూ.. ఆయన ప్రమాణస్వీకారం చేయడం లేదని , ఈ విధంగా గేమ్ ఆడుతూ.. ప్రత్యేక హోదా అంశంపై ఓటింగ్ కు దూరంగా ఉండే యత్నం చేస్తున్నాడని కాంగ్రెస్ నుంచి ఆరోపణ వినిపిస్తోంది!