తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అట్టహాసంగా చేయాలని భాజపా ప్రయత్నిస్తోంది. భాజపా దీన్నొక అధికారిక కార్యక్రమం రేంజిలో ఏర్పాట్లు చేస్తూ, గత కొన్నాళ్లుగా హడావుడి సృష్టించుకుంటూ వచ్చింది. ఈ విషయంలో అందరి అటెన్షన్ ను తమవైపు తిప్పుకోవడంలో భాజపా కొంత సక్సెస్ అయిందనే అనాలి. అయితే, సెప్టెంబర్ 17 విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనకబడిపోయింది. ఆరోజున ఏం చెయ్యాలనే అంశంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో చర్చించారు. ఆ సందర్భంలో భాజపా నిర్వహిస్తున్న తీరు, ఆ పార్టీ వ్యూహం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. మనం కూడా ముందు నుంచే కొంత వ్యూహంతో వ్యవహరించి ఉంటే బాగుండేదని సీనియర్ నేతలు అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… 17వ తేదీన ఉదయం 10 గంటకి గాంధీభవన్ తోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరించాలన్నారు. హైదరాబాద్ ని ఇండియన్ యూనియన్ లో విలీనమైన దిన్నాన్ని తెలంగాణ కాంగ్రెస్ జరుపుకుంటుందన్నారు. అదే రోజు సాయంత్రం 5కి గాంధీ భవన్ లో పీసీసీ ఎగ్జిక్యుటివ్ కమిటీ సమావేశం ఉంటుందనీ, అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీకి సంబంధించి కొన్ని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారనీ, వాటిపై చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు, కేంద్రంలో మోడీ సర్కారు ఇంత త్వరగా విశ్వాసాన్ని కోల్పోతాయని అనుకోలేదనీ, ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపులకు దిగుతూ రాజకీయాలను దిగజార్చారన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతికి కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహిస్తుందని ఉత్తమ్ చెప్పారు.
తెలంగాణ విమోచన దినం విషయంలో కాంగ్రెస్ వెనకబడిందనే చెప్పాలి. దీన్నొక రాజకీయాంశంగా భాజపా వాడుకుంటే ఉంటే… కనీసం ఆ టాపిక్ మీద కూడా ఇంతవరకూ కాంగ్రెస్ నేతలు మాట్లాడలేదు. కేవలం రాజకీయం కోసమే విమోచన దినానికి ప్రాధాన్యత ఇస్తోందనీ, గతంలో ఎన్నడూ ఎందుకు పట్టించుకోలేదనే కౌంటర్ కూడా ఉత్తమ్ ఇవ్వలేదు. సెంటిమెంట్ ని వాడుకునే ప్రయత్నం చేస్తోందని కూడా చెప్పే ప్రయత్నం చెయ్యలేదు. భాజపా చేస్తోంది కాబట్టి, మనం కూడా వారిని అనుసరిస్తూ ఏదో ఒకటి చేస్తే సరిపోతుందనే అభిప్రాయంతో ఉన్నట్టున్నారు. గాంధీ జయంతిని భారీగా చేద్దామని అంటున్నారు!!