కాంగ్రెస్ పార్టీ కూటమిగా ముందుకెళ్లే విషయంలో కొన్ని త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి నడిచే విషయంలో చేస్తున్న రాజకీయంతో ఆ పార్టీ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో అతి కష్టం మీద పొత్తులు పెట్టుకున్నారు కానీ ఎక్కడా వర్కవుట్ లేదు. చివరికి ఢిల్లీలో ఏడుస్థానాల్లోనూ ఓడిపోయారు. మొత్తంగా ముగ్గురు ఎంపీలే గెలిచారు.
ఇప్పుడు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీని కలుపుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. హర్యానాలో ఆప్ కి పెద్దగా సపోర్టు లేదు. కాంగ్రెస్ పార్టీ హాట్ ఫేవరేట్ గా ఉంది. అయితే ఆమ్ ఆద్మీని కలుపుకుంటే తిరుగులేని విజయం వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం నాన్చుతోంది. చివరికి పొత్తుల్లేకుండా బరిలోకి దిగుతామని ఆమ్ ఆద్మీ ప్రకటించాల్సి వచ్చింది. ఇరవై మంది అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది.
త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. ఇప్పుడు హర్యానాలో కాంగ్రెస్ సీట్లు కేటాయించకపోతే.. తర్వాత ఢిల్లీ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ సీట్లు కేటాయించేందుకు ఇష్టపడదు. ఫలితంగా రెండు పార్టీలు ఎవరి దారిలో వారు వెళ్లడానికి సిద్ధపడినట్లుగా అనుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే.. కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షాల్లో మరో బలమైన పార్టీని కోల్పోయినట్లే.