తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ సభ్యులు పోడియం ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో మార్షల్స్ సభలోకి వచ్చారు. గవర్నర్ ప్రసంగంలో రైతుల సమస్య ముచ్చటే లేదంటూ నిరసన తెలుపుతూ ప్రసంగ పత్రాలను గీతారెడ్డి చింపేశారు. ఓపక్క గవర్నర్ ప్రసంగిస్తుండగానే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ హెడ్ ఫోన్స్ తీసి విసిరారు. అది మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కి తగిలింది. దాంతో ఆయన కంటికి స్వల్ప గాయమై, వెంటనే సరోజినీ కంటి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అధికార పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
అయితే, ఇదే అంశమై మీడియాకు వివరణ ఇచ్చారు కోమటిరెడ్డి. నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో సిబ్బంది తనను అడ్డగించారనీ, తన కాలికి కూడా గాయమైందనీ, ఎక్స్ రే తీయాలని వైద్యులు చెబుతున్నారన్నారు. రైతుల మద్దతు ధరపైనే తన పోరాటమనీ, దానికి సంబంధించి పోడియం దగ్గరకి పోవాలని అనుకున్నా అన్నారు. ఇదే తరహాలో పార్లమెంటులో పది రోజుల నుంచీ తెరాస ఎంపీలు పోడియం దగ్గరకి ఎందుకెళ్తున్నారని ప్రశ్నించారు..? ప్రజాస్వామ్యంలో పోడియం దగ్గరకి వెళ్లి నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందన్నారు. పార్లమెంటులో వారు పోడియం దగ్గరకి పోతున్నప్పుడు, ఇక్కడ మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారన్నారు. గతంలో బడ్జెట్ పత్రాలతో స్పీకర్ ను కొట్టిన సందర్భాలున్నాయనీ, ఇప్పుడు మంత్రిగా ఉన్న హరీష్ రావు స్పీకర్ పై దాడి చేశారన్నారు. కానీ, తాము ఆ స్థాయిలో చేయలేదనీ, పోడియం దగ్గరకి పోనియ్యనందుకు నిరసన తెలిపామన్నారు.
ప్రభుత్వ విధానాలపై నిరసన తెలపడం కచ్చితంగా ప్రతిపక్షాల హక్కే. కానీ, స్పీకర్ పోడియం మీదికి దూసుకెళ్లడమూ, మైకులు విరిచేసి విసిరెయ్యడం, ప్రసంగ పత్రాలను చింపేసి స్పీకర్ పై విసరడం… ఇలాంటివన్నీ ఆ హక్కుగా భాగం కాదు కదా! మీరు మైకు ఎందుకు విసిరారో చెప్పండయ్యా అంటే… గతంలో హరీష్ రావు ఇలానే చేయలేదా, ఇప్పుడు పార్లమెంటులో తెరాస ఎంపీలు పోడియం వద్దకు ఎందుకెళ్తున్నారు అంటూ కోమటిరెడ్డి స్పందిస్తూ ఉండటం హాస్యాస్పదం. చట్టసభల్లో నిరసన తెలిపే విధానంలో హుందాతనం ఉండాలి. ఇష్టానుసారం ప్రవర్తించేసి.. దాన్ని కూడా ప్రజాస్వామ్యం నిరసన తెలియజేయడమూ తప్పే అన్నట్టు మాట్లాడితే ఎలా..? ఏదేమైనా, ఈ ఘటనను తెరాస సీరియస్ గానే తీసుకునే అవకాశాలున్నాయి.