కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే కాదు నేటికీ దాని కుంభకోణాలు ఒకటొకటిగా బయటపడుతూ దానిని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అటువంటి వాటిలో ‘నేషనల్ హెరాల్డ్ కేసు’ కూడా ఒకటి. కాంగ్రెస్ పార్టీ ఆ పత్రికకి రూ. 90 కోట్లు అప్పు ఇచ్చి దానిని ఆ సంస్థ తిరిగి చెల్లించకపోవడంతో, ఆ అప్పును వసూలు చేసుకొనే హక్కును రూ.50 లక్షలకు యంగ్ ఇండియా అనే సంస్థకు అప్పగించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సొమ్మును సోనియా, రాహుల్ తమ ఖాతాలలోకి మళ్ళించుకోవడానికే ఆ పధకం పన్నారని ఆరోపిస్తూ, ప్రముఖుల మీద కేసులో వేయడంలో దిట్ట అనిపించుకొన్న బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామీ వారిపై కూడా కేసు వేశారు.
ఈ నెల 19న జరిగే ఆ కేసు విచారణకు సోనియా, రాహుల్ ఇద్దరూ తప్పనిసరిగా హాజరుకావాలని డిల్లీ హైకోర్టు ఆదేశించడంతో మోడీ ప్రభుత్వం తమపై రాజకీయ కక్ష సాధింపుకి పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో కీలకమయిన అనేక బిల్లులు ఆమోదించవలసి ఉంది. కానీ ఆ అంశాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేస్తున్న పార్లమెంటు ఉభయసభలలో చేస్తున్న రాద్దాంతం వలన ఆ బిల్లులు ఆమోదం పొందే అవకాశం కనబడటం లేదు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని మీడియా కూడా తప్పుగా భావిస్తున్నట్లుంది. అందుకే “చట్ట సభలను ఉపయోగించుకొని న్యాయవ్యవస్థపై ఒత్తిడి చేస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు రాహుల్ గాంధిని సూటిగా ప్రశ్నించారు. దానికి ఆయన నేరుగా సమాధానం చెప్పకుండా “ఇది నూటికి నూరు శాతం మాపై కక్ష సాధింపు చర్యలేనని మేము భావిస్తున్నాము. దానిని మేము దైర్యంగా ఎదుర్కొంటాము. మాకు న్యాయవ్యస్థపై నూటికి నూరు శాతం విశ్వాసం ఉంది,” అని జవాబిచ్చారు.
దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, ఈ నేషనల్ హెరాల్డ్ కేసుతో మా ప్రభుత్వానికి ఎటువంటి సంబందమూ లేదు. నిజానికి ఈ కేసు యూపీయే హయాంలోనే మొదలయింది. ఈ కేసులో న్యాయవ్యవస్థ విచారణ చేస్తోంది. దానిలో మేము జోక్యం చేసుకొంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం న్యాయ వ్యవస్థను అవమానించడమే. కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వంపై లేని పోనీ ఆరోపణలు చేయడం మానుకోవాలి. దీనిపై సభలో రాద్ధాంతం చేసే బదులు కోర్టులో కేసును ఎదుర్కొని తన నిజాయితీని నిరూపించుకోవాలి, అని సూచించారు. కానీ కాంగ్రెస్ పార్టీ దాని మిత్ర పక్షాలు నిన్న రాజ్యసభ కార్యక్రమాలు జరగకుండా అడ్డుకొన్నాయి.