వరంగల్ ఉప ఎన్నికలలో పోటీ ప్రధానంగా అధికార తెరాస-ఎన్డీయే-కాంగ్రెస్ పార్టీల మధ్య ఉంటుందని ఇంతవరకు అందరూ భావించారు. కానీ కాంగ్రెస్ అభ్యర్ధి సిరిసిల్ల రాజయ్య కోడలు, ముగ్గురు మనుమలు అనుమానస్పద పరిస్థితుల్లో అగ్ని ప్రమాదంలో మరణించడం, రాజయ్యతో సహా కుటుంబ సభ్యులు అందరూ అరెస్ట్ అవడం, ఆయనకు బదులు వరంగల్ ప్రజలకి పరిచయం లేని సర్వే సత్యనారాయణ బరిలోకి దిగడంవంటి పరిణామాలన్నీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కనబడుతున్నాయి. ఆ కారణంగా కాంగ్రెస్ పరిస్థితి తారుమారు అయ్యేలా ఉంది. కానీ పోటీ ప్రధానంగా కాంగ్రెస్-తెరాసల మధ్యే ఉంటుందని తెలంగాణా కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మల్లు రవి, కొనగాల మహేష్ అభిప్రాయం వ్యక్తం చేసారు. ఎందుకంటే ఎన్డీయే అభ్యర్ధిగా నిలబడుతున్న డా. దేవయ్యకు కనీసం తెలంగాణా సరిహద్దులు కూడా తెలియవని అన్నారు.
బీజేపీ శాసనసభా పక్ష నేత డా.లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఎన్నికలలో పోటీ ప్రధానంగా తెరాస-బీజేపీ అభ్యర్ధుల మధ్యే ఉంటుంది. ఎందుకంటే తెలంగాణాలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని మరిచిపోయి చాల కాలమే అయ్యింది. కనుక మేము కేవలం తెరాసతోనే పోరాడవలసి ఉంటుంది. అందుకే మా అభ్యర్ధి డా. దేవయ్య గురించి తెరాస నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అమెరికాలో చదువుకొని వచ్చి ఇక్కడ ఎన్నికలలో పోటీ చేయలేదా? మంత్రి కాలేదా? అటువంటప్పుడు మా పార్టీ అభ్యర్ధి డా. దేవయ్య అమెరికాలో ఉద్యోగం చేసి వస్తే అదేమయినా ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హతా?” అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా పోటీ తెరాసతోనే తప్ప వాటి మధ్య ఉండబోదని చెప్పడం గమనిస్తే ఆ రెండు పార్టీలు తెరాస ఆధిక్యతను ముందే ఒప్పుకొన్నట్లుంది.