కేసీఆర్ ఎంపీగా పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని.. ఆ విషయాలను తాను బయటపెడతానని బండి సంజయ్ బెదిరించారు. స్పీకర్ పర్మిషన్ తీసుకున్నానని.. తప్ప సరిగా పార్లమెంట్‌ను కుదిపేస్తుందని కూడా చెప్పుకొచ్చారు. అయితే బండి సంజయ్ చెప్పిన సీక్రెట్లను.. రేవంత్ రెడ్డి.. చాలా తేలికగా రివీల్ చేశారు. కేసీఆర్ పార్లమెంట్‌కు హాజరుకాకున్నా మరొకరితో సంతకాలు చేయించారని.. కేసీఆర్ చదివింది బీఏ.. కానీ ఎంఏ చదివినట్లు పార్లమెంట్‌కు సమాచారం ఇచ్చారని ప్రకటించారు. అంతే కాదు.. తాను సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేస్తానని.. విచారణ చేయించగలవా అని బండి సంజయ్‌కు రేవంత్ సవాల్ చేశారు.
పార్లమెంట్‌కు హాజరు కాకుండా కేసీఆర్ చేసిన సంతకాలు ఎవరివో తేల్చడానికి బండి సంజయ్ ఫోరెన్సిక్ టెస్ట్ చేయించగలరా అని రేవంత్ ప్రశ్నిస్తున్నారు. బండి సంజయ్ చెబుతానన్న సంచలన విషయాలను రేవంత్ చాలా తేలిగ్గా బయటపెట్టారు. దీనికి కారణం.. కేసీఆర్, బీజేపీ రెండు పార్టీలూ కలిసి ముసుగులో గుద్దులాట ఆడుతున్నాయని చెప్పడమే. ఇప్పుడు.. రేవంత్ బయట పెట్టిన దాన్ని బట్టి బండి సంజయ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒక వేళ తాను బయట పెడతానన్న సంచలన విషయాలు.. రేవంత్ చెప్పినవి కాకపోతే… అదే విషయాన్ని చెప్పొచ్చు.
ఒక వేళ అదే మ్యాటర్ అనుకుంటే మాత్రం… వాటిపై దర్యాప్తు చేయించాల్సిన బాధ్యత బండి సంజయ్ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే.. ఊరికనే కేసీఆర్ ను… బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని.. వారిద్దరూ ఒక్కటేనని రేవంత్ చేసే ఆరోపణలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇంత కాలం కేసీఆర్ పై కేసులంటూ ప్రకటనలు చేసిన బండి సంజయ్.. ఇటీవల వాటి గురించి పెద్దగా మాట్లాడటం లేదు. కొత్త వాటిపై దృష్టి పెట్టారు.