కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ అనుబంధంగా మారిపోయింది. బీఆర్ఎస్ కు పూర్తి దూరం పాటిస్తోంది. మేడిగడ్డ సందర్శనకు కాంగ్రెస్ తో పాటు మజ్లిస్ ఎమ్మెల్యేలు కూడా వెళ్లారు. దీంతో తెలంగాణ రాజకీయంలో స్పష్టత వచ్చింది. మజ్లిస్ ఇక ఎంత మాత్రం బీఆర్ఎస్ మిత్రపక్షం కాదని తేలిపోయింది. మేడిగడ్డ టూర్ పెట్టుకుంది బీఆర్ఎస్ ..కేసీఆర్ కు వ్యతిరేకంగా . అలాంటి టూర్ కు మజ్లిస్ వెళ్లడం … అంటే.. కాంగ్రెస్ వైపు ఉన్నట్లుగా తేల్చడమే.
నిజానికి మజ్లిస్ కాంగ్రెస్ మిత్రపక్షం కాదు. అధికారంలో ఎవరు ఉంటారో వారికి మిత్రపక్షం మజ్లిస్. తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీతో జత కలిసి పాతబస్తీలో మరొకర్ని రానివ్వకుండా… మరొకరికి మద్దతు ఇవ్వకుండా చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అదే ఫార్ములా పాటిస్తున్నారు. కాంగ్రెస్ కూడా తమకు ఉన్న తక్కువ ఎమ్మెల్యేల మద్దతు కారణంగా మజ్లిస్ తో సామరస్యంగానే ఉండాలనుకుంటోంది.
రాజ్యసభ ఎన్నికల్లో కూడా మజ్లిస్ విధానం కీలకమయ్యే అవకాశం ఉంది. పోటీ ఉంటే కాంగ్రెస్ కు మద్దతిస్తుంది.. అంతగా సమస్య అయితే ఓటింగ్ కు దూరంగా ఉంటుంది. ఇది కూడా కాంగ్రెస్ కు మేలు చేస్తుంది. బీఆర్ఎస్ కు మాత్రం ఓటు వేయదు. ఓ రకంగా ఈ విషయంలో రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్ సాధించినట్లే అనుకోవచ్చు.