తెదేపా ప్రభుత్వానికి ముద్రగడ పద్మనాభం దీక్ష తలనొప్పి వ్యవహారంగా మారగా, కాంగ్రెస్ వైకాపాలను దగ్గరయ్యేందుకు అది దోహదపడటం విశేషం. తమ కులాన్ని ఒక అదనపు అర్హతగా భావిస్తూ ఎన్నికల సమయంలో కాపు కులస్థుల ఓట్లు నొల్లుకోవడమే తప్ప అధికారంలో ఉండగా ఏనాడూ కాపుల యోగక్షేమాల గురించి ఆలోచించని కాపు లీడర్స్ ఇవ్వాళ్ళ హైదరాబాద్ సమావేశం అయ్యి, ముద్రగడ పద్మనాభం దీక్ష, ఆరోగ్యం, ప్రభుత్వ వైఖరి గురించి చర్చించారు.
ఆ సమావేశంలో చిరంజీవి, దాసరి నారాయణ రావు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పల్లంరాజు తదితరులు పాల్గొన్నారు. కాపుల రిజర్వేషన్ వ్యవహారాన్ని ప్రభుత్వం మొదటి నుంచి సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వలననే ఈ సమస్య ఇంత జటిలం అయ్యిందని వారు అభిప్రాయపడ్డారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యని సరిగ్గా పరిష్కరించాలని కోరారు. ముద్రగడ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.
అందరూ ఈ సమస్య గురించి లోతుగానే చర్చించి మాట్లాడారు. బాగానే ఉంది. ముద్రగడ ఆరోగ్యం కాపాడండి..ఈ సమస్యని తక్షణం పరిష్కరించండి..అని ప్రభుత్వానికి సలహా ఇవ్వడమే తప్ప అది ఏవిధంగా చేయవచ్చో ఎవరూ చెప్పలేదు. ముద్రగడ ఆరోగ్యం కాపాడండి అంటే దానర్ధం ఆయనకి బలవంతంగా సలైన్ ఎక్కించామని కోరుతున్నారా లేదా ఆయన కోరుతున్నట్లుగా తుని ఘటనలో అరెస్ట్ చేసిన నిందితులని విడుదల చేసి ముద్రగడ దీక్ష విరమింపజేయమని కోరుతున్నారా? స్పష్టం చేయరు. ఎందుకంటే అలా చేయమని చెప్పే ధైర్యం వాళ్ళకీ లేదు కనుక.
వాళ్ళు నిజంగా ఆయన క్షేమం కోరే వాళ్ళయితే, ఆయన ఆ కారణంతో దీక్ష చేయడం సరికాదని నచ్చజెప్పి, ఆయన చేత దీక్ష విరమింపజేసి ఉండాలి. కానీ ఆవిధంగా కూడా చేయరు. ఆవిధంగా చెపితే మళ్ళీ కాపులకి ఎక్కడ కోపం వస్తుందోననే భయం. ఈ సమస్యని వాళ్ళు ఎవరూ పరిష్కరించలేరు. పరిష్కరించడానికి ముందుకురారు. అందుకోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి సహకరించరు. కానీ వారికి చేతకాని ఈ సమస్యని ప్రభుత్వమే మంత్రదండం తిప్పి పరిష్కరించేయాలని కోరుతుంటారు. ఈ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా హ్యాండిల్ చేయడంలేదని అభిప్రాయపడుతున్నపుడు, దానిని ఏవిధంగా హ్యాండిల్ చేయాలో వారే చెప్పవచ్చు కదా? కానీ ఎక్కడా తమ చేతికి మట్టి అంటకూడదనే జాగ్రత ఒకటి. మరి అటువంటప్పుడు ప్రభుత్వానికి ఉచితసలహాలు ఇవ్వడం దేనికి?వాళ్ళే ఆలోచించుకోవాలి.