వైకాపా నేతలు మొదట్లో ముద్రగడ పద్మనాభాన్ని తెదేపా నేతలు బహిరంగంగా తీవ్ర విమర్శలు చేస్తుంటే, చిరంజీవి, దాసరి నారాయణ రావు, వైకాపా నేతలు ఆయనకి మద్దతుగా మాట్లాడేందుకు సంకోచించేవారు. ఎందుకంటే, కాపులకి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభానికి బహిరంగంగా మద్దతు ఇస్తే, బిసిలు, ఇతర వర్గాల ఆగ్రహానికి గురవుతామనే భయంతోనే అని చెప్పవచ్చు. ఈసారి కూడా ముద్రగడ దీక్ష మొదలుపెట్టిన రెండు రోజుల వరకు వారెవరూ పెద్దగా మాట్లాడలేదు. కానీ ఆయన పట్ల కాపులలో సానుభూతి పెరుగుతోందని గ్రహించగానే అందరూ తమ సంకోచాలు, భేషజాలు అన్నీ పక్కన పెట్టి గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా కొన్ని తప్పటడుగులు వేయడంతో వారి వాయిస్ మరికొంచెం పెంచేరు.
ఇదంతా ఆయన మీద లేదా కాపుల మీద ప్రేమాభిమానలతోనో మాట్లాడుతున్న మాటలు కావని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కాపు ఐడెంటిటీని అందరూ ముఖ్యంగా కాపులు గుర్తించేలా చేసుకోవడం, తద్వారా వారికి తామే అసలు సిసలైన ప్రతినిధులమనే ‘సెల్ఫ్ డిక్లరేషన్’ ఇచ్చుకోవడమే వారి ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోందని ఇతర వర్గాలకి చెందిన వారు అభిప్రాయపడుతున్నారు.
చిరంజీవి, బొత్స సత్యనారాయణల విషయానికే వస్తే వారిద్దరూ అధికారంలో ఉండగా కాపులకి చేసిందేమీ లేదని అందరికీ తెలుసు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం దానిని పూర్తిగా వాడేసుకొని ఒక వెలుగు వెలిగిన వారిరువురూ, కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే ఒకరు సినిమా రంగానికి మరొకరు వైకాపాలోకి వెళ్లిపోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. తమని ఆదరించి పదవులు,అధికారం, హోదా, గౌరవం అన్నీ అందించిన కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు దానికి అండగా నిలబడి కాపాడుకోవలసిన వాళ్ళు తమ దారి తాము చూసుకొన్నారు. ఆదరించిన కాంగ్రెస్ పార్టీనే పట్టించుకోని వాళ్ళు కాపులను పట్టించుకొంటారని భావించలేము. ముద్రగడ పద్మనాభం దీక్షని ఒక అరుదైన రాజకీయ అవకాశంగా భావిస్తున్నందునే అందరూ ఆయన చుట్టూ చేరి ఆయన పేరు చెప్పుకొని రాజకీయ లబ్ది కోసం ప్రాకులాడుతున్నారని చెప్పకతప్పదు.
ముద్రగడ పద్మనాభం ఒక ఉద్దేశ్యంతో నిరాహార దీక్ష చేస్తుంటే, చిరంజీవి, బొత్స సత్యనారాయణ, పల్లం రాజు వంటి రాజకీయనేతలు వేరే ఉద్దేశ్యంతో ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుండటం చూసి ప్రజలు కూడా విస్తుపోతున్నారు. చిరంజీవి వంటి వాళ్ళు ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పటి వరకు ముద్రగడతో కలిసి కాపుల కోసం పోరాడుతున్న అసలైన కాపు నేతలందరూ తమ ప్రాధాన్యతని కోల్పోయారు. దాసరి, చిరంజీవి, బొత్స తదితరులు ఇంతవరకు కాపుల కోసం చేసిందేమీ లేకపోయినా వారే అసలు సిసలైన కాపు నేతలన్నట్లు బిల్డప్ ఇస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.