ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం త్వరలో కాంగ్రెస్, వైకాపా నేతలు కలిసి ఉద్యమం ఆరభించబోతున్నట్లు వార్తలు వచ్చేయి. ఎందుకంటే రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం నిర్లక్ష్యానికి గురవుతోందని చెపుతున్నారు. నిజమే. నేటికీ రాయలసీమ నిరాదరణకు గురవుతోంది. అయితే రాయలసీమ పరిస్థితిని చూసి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కార్చుతున్న కాంగ్రెస్ నేతలు గత పదేళ్ళుగా తమ పార్టీయే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? సీమ అభివృద్ధికి వారు ఏమి చేసారు? సీమలో ఒక్కో ప్రజా ప్రతినిధిని తమతమ నియోజక వర్గాల వారిగా ఏమేమి అభివృద్ధి కార్యక్యమాలు చేప్పట్టారు? వాటిలో ఎన్ని పూర్తి చేసారు? అసలు ఎన్నాడయినా అటువంటి ఆలోచన చేసారా లేదా? అనే ప్రశ్నలకు సీమ కోసం ఉద్యమించడానికి సిద్దమవుతున్న కాంగ్రెస్ నేతలు జవాబులు చెప్పవలసి ఉంది.
చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం, నల్గొండ ఏడు జిల్లాలతో కలిపి రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనేది వారి ప్రధాన డిమాండ్ అని వార్తలు వచ్చేయి. అదే నిజమయితే వారి పోరాటంలో చిత్తశుద్ధి లేదని ముందే రుజువు చేసుకొన్నట్లు భావించవచ్చును. ఎందుకంటే సుదీర్గ పోరాటాల తరువాత ఇటీవలే ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణాలోని నల్గొండ జిల్లాను వేరు చేయడం సాధ్యమేనని అనుకొంటే అవివేకమే అవుతుంది. ఒకవేళ అటువంటి ప్రయత్నాలు చేస్తే తెలంగాణా ప్రజలు, పార్టీలు దానిని తీవ్రంగా వ్యతిరేకించడం ఖాయం. ఈ సంగతి సీమ కోసం ఉద్యమించడానికి సిద్దమవుతున్న హేమహేమీలకు తెలియదనుకోలేము. అయినా వారు నల్గొండను సీమలో కలపాలని అనుకొంటున్నట్లయితే, వారు సాధ్యం కాని అటువంటి డిమాండ్ తో సుదీర్ఘ కాలం పోరాటాలు కోనసాగించడం కోసమే నల్గొండను చేర్చినట్లు చెప్పకతప్పదు. తద్వారా ఆంధ్రా, తెలంగాణా, రాయలసీమ ప్రజల మధ్య మళ్ళీ చిచ్చురగిల్చి నట్లువుటుంది. అంటే వారు ప్రత్యేక రాష్ట్రం కోసం కాక తమ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే ఈ ఉద్యమానికి సిద్దం అవుతున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చును.