అఫెన్స్ ఈజ్ బెస్ట్ ఫారం అప్ డిఫెన్స్ అంటారు. టిడిపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎంఎల్ఎ రేవంత్ రెడ్డి వ్యవహారం అలాగే వుంది. ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తే ఏమాత్రం సహించేది లేదని ఆ పార్టీ పెద్దలు పంతం పట్టారు. దగ్గరగా మసలే యువనేతల్లోనూ సబితాఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ వంటివారు మినహాయిస్తే ఎక్కువమంది చాటున విమర్శిస్తూనే వున్నారు. అసలు రేవంత్ రాకతో తమ లెక్కలు తారుమారైనాయనే వారు చాలామంది. అందుకే ఆయన పాదయాత్రకు అనుమతి రాకుండా చేశారు. ఏది మాట్లాడినా తప్పులు వెతికే పనిలో కొందరున్నారు.వారి అవసరం లేకుండానే ఆయనే చాలా తప్పులు మాట్లాడుతుంటారు. స్వతహాగా విచక్షణా శక్తి గల వ్యక్తిగా ఏది మాట్లాడకూడదో ఆయనకు తెలుసు. కాని ఏదో ఒక విధంగా రాజకీయ అరెస్టుకు దాడికి గురైతే ఓటుకు నోటు మచ్చ మాసిపోయి ఇది మిగులుతుందని రేవంత్ అనుకుంటున్నారట. ఇప్పుడు పరుషపదజాలం వాడితే ఎవరినైనా నేరుగా పోలీసులే కేసు పెట్టి అరెస్టు చేసే చట్టం తీసుకురావడం ఆయన కోసమేనని కూడా ఒక వాదన. తాజాగా గవర్నర్ నరసింహన్ కెసిఆర్‌ను కాళేశ్వరం చంద్రశేఖర రావు అని కీర్తిస్తే రేవంత్ కచరా అని కొత్త పేరు పెట్టారు. ఇవన్నీ ముఖ్యమంత్రిని చేరి ఏదైనా చర్య తీసుకుంటే మళ్లీ సంచలనం తథ్యమని ఆయన ఆలోచనగా చెబుతున్నారు. అయితే రేవంత్‌కు ఎలాటి రాజకీయ గౌరవం ఇవ్వరాదనేది ప్రభుత్వ వ్యూహం. ఈ క్రమంలో ధారాళంగా తిట్టు కురుస్తూనే వుంటాయన్నమాట. కెసిఆర్ పట్టించుకోకపోయినా కాంగ్రెస్‌లో రేవంత్ ప్రత్యర్థులు మాత్రం దీనిపై గొడవ రేయడం అనివార్యం.