వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రాలేకపోయిన కాంగ్రెస్ పార్టీ… అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తూ, ఒక్కో రాష్ట్రంలో పాగా వేయాలన్న ఉద్దేశంతో ఉంది. అందుకే ఒక రాష్ట్రంలో సక్సెస్ అయిన ఫార్మూలాను ఇంకో రాష్ట్రంలోనూ పాటిస్తోంది.
కర్నాటకలో గెలవగానే తెలంగాణలోనూ గెలిచేస్తున్నాం అన్న మూడ్ ను క్రియేట్ చేసింది కాంగ్రెస్. అంతేకాదు అక్కడ ఇచ్చిన మేనిఫెస్టోకు కాస్త మార్పులు చేర్పులు చేసి… ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణలో ఎన్నికల హామీలిచ్చింది. ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు, మహిళలకు 2వేల సహయం, ఉచిత విద్యుత్, 500రూపాయలకే గ్యాస్ సిలిండర్, పెన్షన్ పెంపు వంటివి ఉన్నాయి.
ఇప్పుడు తాజాగా హర్యానాలోనూ ఇదే ఫార్మూలాతో వెళ్తోంది. వచ్చే నెల 5వ తేదీని హర్యానాలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. ఇందులో…
500రూపాయలకే గ్యాస్ సిలిండర్
300యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్
మహిళలకు నెలకు 2వేల రూపాయల సహయం
ఏటా 2లక్షల ఉద్యోగాలు
డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా హర్యానా
పెన్షన్ 6వేల రూపాయలకు పెంపు
పంట నష్టపోతే పరిహారం వంటివి కీలకంగా ప్రస్తావించింది. కర్నాటక, తెలంగాణలోనూ దాదాపు ఇవే హామీలతో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ ను, విన్నింగ్ ఫార్మూలా హర్యానాలోనూ గట్టెక్కిస్తుందో చూడాలి.