పంజాబ్ శాసనసభ ఎన్నికలలో ఇంకా 7-8 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈసారి ఎన్నికలలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం అందుకు అనుగుణంగా అడుగులు వేయకపోగా వరుసగా తప్పటడుగులు వేస్తూ ఇప్పుడే తన ఓటమిని ఖరారు చేసేసుకొంటోంది.
పంజాబ్ ఎన్నికల ఇన్-ఛార్జ్ గా మొదట మాజీ కేంద్రమంత్రి కమల్ నాథ్ ని నియమించింది. కానీ 1984లో డిల్లీలో జరిగిన సిక్కుల హత్యలతో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనని రాష్ట్ర ఎన్నికల ఇన్-ఛార్జ్ గా నియమించడంపై పంజాబ్ లో విమర్శలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ అధిష్టానం తక్షణమే ఆయనని తొలగించింది.
ఈలోగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో తనకి తగిన గుర్తింపు, ప్రాధాన్యం ఇవ్వడం లేదనే సాకుతో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతున్నారు. సరిగ్గా ఎన్నికలకి ముందు అటువంటి సీనియర్ నేత పార్టీని విడిచివెళ్ళిపోవడం ఒక దెబ్బ అయితే, ఆయన స్వంతంగా రాజకీయ పార్టీని పెట్టుకోవడానికి సిద్దం అవుతుండటం మరో ఎదురుదెబ్బేనని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన కొత్త పార్టీ పెడితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరే బయటకి వెళ్లరు. పార్టీని నిట్టనిలువుగా చీల్చి చాలా మందిని తనతోబాటు బయటకి తీసుకుపోవడం ఖాయం. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ అధిష్టానానికి తెలిసి ఉన్నప్పటికీ అమరీందర్ సింగ్ పార్టీ వీడివెళ్లిపోకుండా అడ్డుకోలేకపోయింది. బహుశః కాంగ్రెస్ పార్టీ ఇందుకు ఎన్నికలలో చాలా భారీ మూల్యం చెల్లించవలసి రావచ్చు.
కమల్ నాథ్ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖమంత్రిగా పనిచేసిన ఆషా కుమార్ ని నియమిస్తున్నట్లు ప్రకటించింది. అయితే అది కూడా మరో పొరపాటేనని చెప్పక తప్పదు. అటవీ శాఖకి చెందిన 80 బిగాల విస్తీర్ణం కలిగిన భూమిని తన భర్త స్వర్గీయ బ్రిజేందర్ సింగ్ కుమార్ కి కట్టబెట్టడం కోసం ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు చంబా కోర్టులో ఒక కేసు దాఖలైనప్పుడు ఆమె తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆమె దోషి అని రుజువు అవడంతో న్యాయస్థానం ఆమెకి ఒక ఏడాది జైలు శిక్ష, రూ.8,000 జరిమానా విధించింది. ఆమె బెయిల్ పొంది హైకోర్టులో అప్పీలు చేసుకోగా తీర్పు ఆమెకి అనుకూలంగా వచ్చింది. ఆ తీర్పుని పిటిషనర్ సుప్రీం కోర్టులో సవాలు చేయగా, హైకోర్టు ఇచ్చిన తీర్పుని పక్కనబెట్టి ఆ కేసుపై పునర్విచారణ చేయమని చంబా కోర్టుని ఆదేశించడంతో ఆ కేసు మళ్ళీ విచారణ జరుగుతోంది.
పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా 78 ఏళ్ల వృద్దురాలు మాజీ డిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరు ఖరారు చేయబోతోందని సమాచారం. ఆమె హయంలో రూ.400 కోట్ల నీళ్ళ ట్యాంకర్ల కుంభకోణం జరిగింది అని ఆరోపిస్తూ వారం రోజుల క్రితమే అవినీతి నిరోధఖ శాఖ అధికారులు ఆమెపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆమెను ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉందని తెలిసిన తరువాతే ఆమెపై ఈ కేసు నమోదు అవడం గమనిస్తే, అది ఆమెని దెబ్బతీయడానికేననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆషా కుమార్, షీలా దీక్షిత్ లతో కాంగ్రెస్ పార్టీ పంజాబ్ ఎన్నికలకి వెళితే ఏమవుతుందో తేలికగానే ఊహించవచ్చు. ఇవన్నీ గమనిస్తే కాంగ్రెస్ అధిష్టానం తన ఓటమిని తనే పక్కా వ్యూహం రచించుకొంటున్నట్లుంది.