హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో విజయవాడ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని దాఖలుచేసిన పిటిషన్పై వాదించటంకోసం సుప్రసిద్ధ న్యాయవాది రాంజెత్మలానిని తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దించిన విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వం తప్పుచేసింది కాబట్టే తప్పించుకునేందుకు రాంజెత్మలానిని రంగంలోకి దించిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వాలే కూలిపోయే అవకాశం ఉందికాబట్టి కేసీఆర్ ప్రభుత్వం భయంతోనే గంటకు లక్షలలో ఫీజును తీసుకునే న్యాయవాదిని దించిందని కాంగ్రెస్ సీనియర్ నేత గండ్రవెంకటరమణారెడ్డి ఆరోపించారు.
ఏది ఏమైనా మొదట్లో ట్యాపింగే చేయలేదని మీడియాముందు చెప్పిన తెరాస ప్రభుత్వం, ఇప్పుడు న్యాయస్థానంముందు అంగీకరించటంతో ప్రతిపక్షాలకు అడ్డంగా దొరికిపోయిందని చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధంగా జరిగిందా, లేదా అనేది న్యాయస్థానాలు తేల్చాల్సిఉంది. దేశభద్రతకు ముప్పు ఏర్పడేటటువంటి కేసులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితోనే ట్యాపింగ్ చేయాలని చట్టం పేర్కొంటోంది. ఈ కేసులోకూడా అనుమతికోసం కేంద్రానికి లేఖ రాయటంవరకు నిబంధనల ప్రకారమే జరిగింది. అయితే కేంద్రంనుంచి అనుమతి రాకుండానే ఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టారని, ముఖ్యమంత్రిస్థాయి వ్యక్తి ఫోన్నుకూడా నిబంధనలకు విరుద్ధంగా ట్యాప్ చేశారన్నది ఆరోపణ. ఇది ఎంతవరకు నిజమనేది న్యాయస్థానంలో తేలుతుంది.