ముందస్తు సమరభేరీ మోగించి.. టిక్కెట్లు కూడా ఖరారు చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మహిళలను అసలు పట్టించుకోలేదు. తెలంగాణ మంత్రివర్గంలో మహిళకు అవకాశం లేదు. నిజంగా.. దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో మహిళలు లేని మంత్రివర్గం లేదు. ఇప్పటి వరకు ప్రకటించిన 107 మంది అభ్యర్థుల్లో కేవలం నలుగురికి మాత్రమే టిక్కెట్లు ఖరారు చేశారు. ఆలేరు నుంచి గొంగిడి సునీత, ఖానాపూర్ నుంచి రేఖా నాయక్, అసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మి , మెదక్ నుంచి పద్మా దేవేందర్‌రెడ్డి మళ్లీ బరిలోఉంటున్నారు. తప్పితే..మరో మహిళకు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. మల్కాజిగిరి, వికారాబాద్ నుంచి మహిళల పేర్లు వినిపిస్తున్నాయి కానీ..వారికి కూడా ఇచ్చే అవకాశం లేదంటున్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 65 సీట్లలోనే… పది మంది మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించింది. ఆదిలాబాద్ – సుజాత, ఆర్మూర్ – ఆకుల లలిత, నర్సాపూర్ – సునీతా లక్ష్మారెడ్డి, జహీరాబాద్ – గీతారెడ్డి, మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి, గద్వాల – డీకే అరుణ, కోదాడ – పద్మావతీరెడ్డి, స్టేషన్ ఘన్పూర్ – సింగాపురం – ఇందిర, పరకాల – కొండా సురేఖ, ములుగు – సీతక్కలకు సీట్లు ఖరారు చేసింది. టీఆర్ఎస్ మొత్తం 105 మందిలో ఇచ్చింది నలుగురికి. కానీ 65 మందితో కూడిన తొలి జాబితాలోనే కాంగ్రెస్ మహిళలకు ఇచ్చిన టికెట్లు పది. రెండో జాబితా , తుది జాబితా వరకు విజయశాంతి వంటి మరికొంత మంది మహిళలకు సీట్లు దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. కూటమిలోని ఇతర పార్టీల నుంచి లాయర్ రచనారడ్డి లాంటి వాళ్లు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఏ విధంగా చూసినా మహాకూటమిలో మహిళల ప్రాతినిధ్యం… టీఆర్ఎస్ కన్నా కొన్ని రెట్లు ఎక్కువగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.
33శాతం రిజర్వేషన్ల కోసం మహిళలు పోరాడుతున్న దేశంలో.. మహిళలను చాలా తేలికగా తీసుకుంటున్న పార్టీ టీఆర్ఎస్నే కావొచ్చు. ఓ రాజకీయ పార్టీ.. మహిళా నాలుగు, ఐదు శాతంలోపే సీట్లను కేటాయించడం చాలా అరుదు. ఎందుకంటే.. మహిళా సెంటిమెంట్ చాలా బలమైనది. తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన వారిలో వస్తే… మొత్తానికే మోసం వస్తుంది. ఓటర్లలో సగం మంది మహిళలే ఉంటారు. నిజానికి మహిళలు… కులం, మతం, ప్రాంతం ప్రాతిపదిన ఓటింగ్‌లో ప్రభావితం గరయ్యేది చాలా తక్కువ. వారిని ప్రభావితం చేసే అంశాలు విడిగా ఉంటాయి. అలాంటి అంశాల్లో ఇప్పుడు మహిళలకు కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యత అంశం వచ్చిందంటే… టీఆర్ఎస్కు ఇబ్బందికరమే. మహిళలపై కేసీఆర్ వివక్షను.. మహాకూటమి … వారిలోకి తీసుకెళ్తే.. ఓ ప్రధాన వర్గం ఓట్లు టీఆర్ఎస్కు మైనస్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.