కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సొంత నియోజక వర్గంలో సీఎం కేసీఆర్ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ ను ముందు జాగ్రత్త చర్య పేరుతో పోలీసులు అరెస్టు చేయడం, ఈ అరెస్టుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, చివరికి రేవంత్ విడుదల! ఈ ఎపిసోడ్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి కొంత ప్లస్ అయిందనే చెప్పాలి. రేవంత్ విషయంలో ప్రభుత్వం అత్యుత్సాహంతో వ్యవహరించిందనేది బాగా చర్చనీయం అవుతోంది. రేవంత్ విడుదల తరువాత కాంగ్రెస్ ప్రముఖ నేతలు ఆయన్ని వరుసగా పరామర్శిస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా ఓ ట్వీట్ కూడా చేశారు. సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ నేరుగా కొడంగల్ వచ్చి రేవంత్ ను కలుసుకున్నారు. అయితే, ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ని ఉద్దేశించి మాట్లాడుతూ… పొగరు తలకెక్కించుకుని ఎవ్వరూ రాజకీయాలు చెయ్యకూడదన్నారు ఆజాద్. కళ్లు నెత్తికి ఎక్కించుకోకుండా, పాదాలు నేలమీదే ఉంచుకోవాలనీ, గాల్లో ఎగరకూడదన్నారు. ‘ఈ కుర్చీ ఎవ్వరిదీ కాదు, ఇవాళ్ల ఆయన దగ్గరుంది, రేపు ఉండదు. ఇప్పుడాయన ఉన్న స్థానంలో రేవంత్ రెడ్డి ఉండొచ్చు’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు కేరింతలు కొట్టారు. ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయన్నారు ఆజాద్. ఏ నాయకుడి మీదనైనా ఇలాంటి కక్షపూరిత చర్యలు తీసుకునే ముందు… అదే పరిస్థితి నాకూ ఎదురైతే ఎలా ఉంటుందనే ఆలోచన చేసేవాడే తెలివైన నాయకుడు అన్నారు. సొంత పార్టీతోపాటు విపక్షాలతో కూడా సౌమ్యంగా వ్యవహరించేవాడే అసలైన లీడర్ అన్నారు ఆజాద్.
రేప్పొద్దున్న ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ ఉండొచ్చు… ఆజాద్ చేసిన ఈ వ్యాఖ్యల రేవంత్ అభిమానుల్లో మాంచి ఉత్సాహాన్ని నింపిందనడంలో సందేహం లేదు. అయితే, కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే చర్చకు ఆస్కారం ఇవ్వకుండానే ఇంతవరకూ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నేతలు నెట్టుకుంటూ వచ్చారు. హైకమాండ్ కూడా ఆ దిశగా తెలంగాణ నేతల ఆలోచనను వెళ్లనీయకుండా, తాత్కాలికంగా కట్టడి చేయడంలో విజయం సాధించందనే చెప్పాలి. కేసీఆర్ మీద గెలుపే ప్రథమ కర్తవ్యం అన్నట్టుగా కాంగ్రెస్ తోపాటు ప్రజా కూటమి పక్షాలన్నీ ఏకతాటిపై ఉన్నాయి. అయితే, ముఖ్యమంత్రి పీఠం కోసం కలలు కంటున్న దాదాపు అరడజను మంది కాంగ్రెస్ నేతలకు… ఆజాద్ వ్యాఖ్యలు కొంత గుబులు పుట్టించేవిలా ఉన్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో హైకమాండ్ కి ఉన్న ఆలోచనల్నే ఆజాద్ వ్యక్తీకరించారా అనే చర్చకు కాంగ్రెస్ లో తెర లేచినట్టయింది.