ఉత్తరప్రదేశ్ ఎన్నికలకి ఇంకా సుమారు 7 నెలల సమయం ఉంది. ఈసారి మిగిలిన పార్టీల కంటే చాలా ముందుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభించేసింది. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి షీలా దీక్షిత్, ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రాజ్ బబ్బర్, యుపి రాష్ట్ర నేతలు ఆ రాష్ట్రంలో మూడు రోజులు బస్సు యాత్రకి శనివారం డిల్లీ నుంచి బయలుదేరారు. వారి యాత్రకి “27 ఏళ్ళు యూపి దుస్థితి” అనే పేరు కూడా పెట్టారు. ఎందుకంటే, 27 ఏళ్ళ క్రితం కాంగ్రెస్ చేతిలో నుంచి అధికారం ఇతర పార్టీల చేతుల్లోకి వెళ్లిపోయినప్పటి నుంచి ఆ రాష్ట్రం పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారయిందని చెప్పడం దాని ఉద్దేశ్యం.
అయితే అటువంటి నినాదం ఎంచుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మొదట్లోనే చాలా పెద్ద పొరపాటు చేసిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీని ఉత్తరప్రదేశ్ ప్రజలు గత 27 ఏళ్లుగా దూరంగా ఉంచుతున్నారని స్వయంగా ఊరూరు తిరిగి చాటింపు వేసుకొన్నట్లవుతుంది. గత 27 ఏళ్ళలో స్వంత గడ్డ మీదనే ఒక్కసారి కూడా ఎందుకు విజయం సాధించలేకపోయాము? ప్రజలు పదేపదే కాంగ్రెస్ పార్టీని ఎందుకు తిరస్కరిస్తున్నారు? కారణాలు ఏమిటి? లోపం ఎక్కడ ఉంది? అని ఆలోచించకుండా, ఇంత కాలంగా పరిపాలిస్తున్న వారి చేతిలో రాష్ట్రం చాలా నష్టపోయింది అని ప్రచారం చేయాలనుకోవడం చాలా విచిత్రంగా ఉంది. నిజానికి రాష్ట్రంలో అధికారం సంపాదించుకోలేకపోవడం వలన కాంగ్రెస్ పార్టీయే నష్ట పోయింది తప్ప రాష్ట్రము, ప్రజలు కానే కాదు.
ఇక ఈ బస్సు యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ప్రయోజనం ఉంటుందో లేదో తెలియదు కానీ ఈ యాత్ర ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న షీలా దీక్షిత్ కి, కొత్తగా పిసిసి అధ్యక్షుడుగా ఎన్నికయిన రాజ్ బబ్బర్ కి అగ్నిపరీక్షగానే చెప్పవచ్చు.
షీలా దీక్షిత్ వయసు 78 ఏళ్ళు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో పోలిస్తే షీలా దీక్షిత్ వయసు కూడా ఒక ప్రతిబంధకంగానే మారవచ్చు. అంత వృద్ధురాలిని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడంపై రాష్ట్ర నేతలు చాలా మంది వ్యతిరేకించారు. ఈ వయసులో ఆమె శ్రమ పడగలరా? అందుకు ఆమె ఆరోగ్యం సహకరిస్తుందా? సహకరించినా 27 ఏళ్ళపాటు అధికారానికి దూరంగా ఉన్న కారణంగా రాష్ట్రంలో పూర్తిగా చితికిపోయున్న కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసి మళ్ళీ సమరోత్సాహం కలిగించగలరా? ఇదివరకులాగా ప్రజలని, పార్టీ నేతలని ఆకట్టుకొనే విధంగా ప్రసంగించగలరా?వంటి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కనుక ఆమె మూడు రోజులు ఏకధాటిగా బస్సు యాత్ర చేసి రాగలిగితే, ఆ శ్రమకి తట్టుకోగలరో లేదో తేలిపోతుంది. మిగిలిన సంగతులు గురించి తరువాత ఆలోచించవచ్చు. కనుక ఆమెకి ఈ బస్సు..యాత్ర అగ్నిపరీక్ష వంటివవేనని భావించవచ్చు.
రాజ్ బబ్బర్ చాలా కాలంగా రాజకీయాలలో ఉన్నప్పటికీ, సరిగ్గా ఎన్నికలకి ముందు ఇటువంటి దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సారధ్యం వహించి విజయం సాధించడం చాలా కష్టమైనా పనేనని చెప్పవచ్చు. ఒకవైపు అసంతృప్తితో ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు, మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్ వాది పార్టీని, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాని, రాష్ట్రంలో చాలా బలంగా ఉన్న బహుజన సమాజ్ వాదీ పార్టీలని ఎదుర్కొని, 27 ఏళ్ళగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవలసి ఉంది. కనుక రాజ్ బబ్బర్ కి కూడా ఇది అగ్ని పరీక్షగానే భావించవచ్చు. వారిద్దరూ కలిసి రాష్ట్రంలో ఈసారైనా కాంగ్రెస్ పార్టీకి అధికారం సంపాదించి పెడతారో లేక ఆ 27 సంఖ్యకి మరో 5 జోడిస్తారో చూడాలి.