వరంగల్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సర్వే సత్యనారాయణ స్థానికుడు కాదని, స్థానికుడయిన తెరాస అభ్యర్ధి పసునూరి దయాకర్ కే ఓటు వేసి గెలిపించాలని మంత్రి కేటీఆర్ గట్టిగా ప్రచారం చేస్తున్నారు. దానిపై స్పందించిన సర్వే సత్యనారాయణ తన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ నువ్వు, నీ తాత ముత్తాతలు ఎక్కడ పుట్టారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో అవునా కాదా? అని సూటిగా ప్రశ్నించారు. ఎక్కడో పుట్టిన కేసీఆర్ తెలంగాణా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవవచ్చును. అమెరికాలో చదువుకొని వచ్చిన కేటీఆర్ ఎన్నికలలో పోటీ చేసి మంత్రి పదవి చేప్పట్టవచ్చును. నీ కుమార్తె కవిత నిజామాబాద్ లో పుట్టకపోయినా అక్కడి నుంచి పోటీ చేయవచ్చును. కానీ తెలంగాణాలో పుట్టి పెరిగిన నేను వరంగల్ ఉప ఎన్నికలలో పోటీ చేయకూడదా? నీ పుట్టు పూర్వోత్తరాల చరిత్రను త్వరలోనే బయటపెడతాను,” అని సర్వే సత్యనారాయణ హెచ్చరించారు.
బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఎన్.ఆర్.ఐ. డా. దేవయ్య స్థానికతను కూడా తెరాస నేతలు ప్రశ్నిస్తున్నారు కానీ ఆయన కేసీఆర్ కుటుంబ సభ్యులలాగ మంచి మాటకారి కాకపోవడంతో వారికి ఈవిధంగా ధీటుగా జవాబుచేప్పలేక తడబడుతున్నారు. ఇప్పుడు సర్వే సత్యనారాయణ చెప్పిన మాటలు పట్టుకొని ఆయన కూడా తెరాసను ధీటుగా ఎదుర్కోవచ్చును.