తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో పార్టీ సీనియర్ నేతలందరికీ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందరి మాట వింటున్నారు. కానీ ఇదంతా కేవలం గౌరవించడానికేనన్న సంకేతాలూ ఇస్తున్నారు. పార్టీ నేతలు చేసుకున్న దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసేందుకు సమావేశమైన ఎన్నికల కమిటీలో…. ఎవరి మాటలకూ చాన్సివ్వలేదు. ఓ జాబితా ఇచ్చి.. టిక్ చేయమని సూచించారు. పర్సన్ టు పర్సన్ చర్చించి మూడు పేర్లు ఖరారు చేస్తారని భావించిన వారికి నిరాశే మిగిలింది.
ఒక్కో నియోజకవర్గంలో ముగ్గురి పేర్లను టిక్ మార్క్ చేయాలనీ, తెలియకపోతే వదిలేయాలంటూ పీఈసీ చైర్మెన్ సూచించడంతో సభ్యులు హడావుడిగా టిక్ మార్క్ చేసి వెళ్లిపోయారు. మాటల్లేకుండానే టిక్మార్క్ చేయడంతో తొందరంగానే సమావేశం ముగిసింది. అభ్యర్థుల గురించి చర్చించకుండానే పీఈసీ సమావేశాన్ని ముగించడంతో తమ వర్గం వారికి మద్దతుగా మాట్లాడాలనుకున్న నేతలకు నిరాశే ఎదురయింది. పీఈసీ సభ్యుడు ఏయే పేరుపై టిక్ మార్క్ చేశాడో వారికి గురించి తర్వాత తెలంగాణ రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ ముందు చెప్పాల్సి ఉంది. అతనికి కచ్చితంగా టికెట్ ఇవ్వాలని చెప్పే హక్కు సభ్యుడికి లేదు…కానీ దరఖాస్తుదారుల్లో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయో చెప్పడానికి స్క్రీనింగ్ కమిటీ అవకాశం కల్పిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాటన్నింటిని పూర్తిగా పరిశీలించిన తర్వాత నియోజకవర్గానికి మూడు పేర్ల చొప్పున ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పీఈసీ పంపనుంది.
మొత్తం ఎంపిక ప్రక్రియ సాధారణమేనని.. నేరుగా అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్లుగా కాకుండా ప్రజాస్వామ్య పద్దతుల్లో అభ్యర్థుల్ని ఎంపిక చేశామని చెప్పుకోవడానికి ఈ ప్రక్రియ అన్న వాదన వినిపిస్తోంది. నిజానికి ఇప్పటికే ఓ జాబితాను రెడీ చేశారని… వాటికి ఆమోదం కోసమే… ఈ ప్రక్రియ నడిపిస్తున్నారని అంటున్నారు. ఇక్కడ ఎవరూ ప్రాధాన్యం దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేసే చాన్స లేదు. ఎందుకంటే… అందరి మాటలు వింటున్నారు మరి.!