ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాలలో వస్తు సేవల పన్నుల (జి.ఎస్.టి.) బిల్లుతో సహా మరో 35 ముఖ్యమయిన బిల్లులను ఆమోదింపజేసుకొందామని మోడీ ప్రభుత్వం భావించింది. కానీ రాజ్యసభలో ఎన్డీయేకి తగినంత బలం లేకపోవడంతో వాటి ఆమోదం కొరకు కాంగ్రెస్ పార్టీ సహాకారం తప్పనిసరయింది. కాంగ్రెస్ పార్టీని ఒప్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడి ఒకమెట్టు దిగివచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని, మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ని తన ఇంటికి టీ సమావేశం కోసం ఆహ్వానించడంతో పార్లమెంటు సమావేశాలు మొదలవక మునుపే మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ పైచెయ్యి సాధించినట్లు స్పష్టం అయ్యింది. సోనియా, మన్మోహన్ సింగ్ జి.ఎస్.టి. బిల్లుపై సానుకూలంగా మాట్లాడినట్లు వార్తలు వచ్చేయి. కానీ పార్లమెంటు సమావేశాలు మొదలయిన తరువాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ యదా ప్రకారం ఉభయసభలను స్తంభింపజేయడం మొదలుపెట్టింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలను కోర్టుకు హాజరు కావలసిందేనని డిల్లీ హైకోర్టు స్పష్టం చేయడంతో మోడీ ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు పార్లమెంటుని స్తంభింపజేయడం మొదలుపెట్టాయి. సోనియా, రాహుల్ వ్యక్తిగత సమస్యలు, కేసుల కోసం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటును స్తంభింపజేయడంపై దేశ ప్రజలు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీ వైఖరిని తప్పు పడుతున్నారు. పార్లమెంటులో వివిధ రాజకీయ పార్టీల సభ్యులు కూడా తప్పు పడుతున్నారు. ఇక ఎన్డీయే సభ్యులు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీని వారిస్తూనే ఉన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ ఎవరి అభ్యంతరాలను, విమర్శలను పట్టించుకోకుండా ఉభయసభలను స్తంభింపజేస్తోంది.
ఇక విధిలేని పరిస్థితుల్లో బీజేపీ కూడా ఎదురుదాడికి దిగింది. సోనియా, రాహుల్ గాంధీల వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ఏకంగా పార్లమెంటునే హైజాక్ చేస్తున్నారని ఆరోపించింది. నేషనల్ హెరాల్డ్ కేసుతో దేశ ప్రజలకు, కేంద్రప్రభుత్వానికి, పార్లమెంటుకి ఎటువంటి సంబంధమూ లేకపోయినప్పటికీ సోనియా, రాహుల్ గాంధీలను రక్షించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుని హైజాక్ చేస్తోందని బీజేపీ ఎదురు దాడి చేయడం మొదలుపెట్టిన తరువాత కానీ కాంగ్రెస్ అధిష్టానానికి తను చేస్తున్న తప్పు తెలిసిరాలేదు. తమ వైఖరిని తప్పు పడుతూ బీజేపీ చేస్తున్న ఎదురు దాడి వలన కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుందని, తమ వైఖరి వలన ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నామని కాంగ్రెస్ పార్టీ చాలా ఆలస్యంగా గ్రహించి ఆ తప్పును సరిదిద్దుకొనే ప్రయత్నంలో మాట మార్చింది.
తాము నేషనల్ హెరాల్డ్ కేసు కోసం పార్లమెంటును స్తంభింపజేయడం లేదని వ్యాపం కుంభకోణం కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, లలిత్ మోడీ కేసులో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే మరియు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రాజీనామాల కోసం, అలాగే దళితుల పట్ల అవమానకరంగా మాట్లాడినందుకు కేంద్ర మంత్రి వికె సింగ్ రాజీనామా కోసం పట్టుబడుతూ పార్లమెంటును స్తంభింపజేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మాట మార్చింది. కాంగ్రెస్ పార్టీ మాట మార్చినప్పటికీ ఏదో ఒక సాకుతో పార్లమెంటును స్తంభింపజేయడం తధ్యమని తేల్చి చెప్పిన్నట్లయింది. దేశ ప్రయోజనాల కంటే తమకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, నేషనల్ హెరాల్డ్ కేసు నుంచి సోనియా, రాహుల్ గాంధీలను కాపాడుకోవడమే ముఖ్యమని అందుకోసం పార్లమెంటులో పరోక్ష యుద్ధం చేయబోతున్నట్లు స్పష్టం చేసినట్లయింది.