2019 ఎన్నికల ఫలితాలు వచ్చేశాయండీ! తెలంగాణలో ప్రస్తుత అధికార పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అనే లెక్క ఇప్పుడే తేలిపోయింది. తెరాసలో పేరున్న నాయకులు కూడా ఓటమి పాలౌతారని కూడా తేలిపోయింది! నిజమండీ బాబూ… వచ్చే ఎన్నికల ఫలితాలను ఇప్పుడే ప్రకటించేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన దగ్గర టైమ్ మెషీన్ లాంటిది ఏదో ఉందో ఏమో తెలీదుగానీ.. వచ్చే ఎన్నికల్లో తెరాసకు ఎన్ని సీట్లు వస్తాయో లెక్కలు చెప్పేశారు. 2019లో తెరాస అధికారంలోకి రాదని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. అంతేకాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గెలవడం కష్టమని అన్నారు. కేసీఆర్‌కే ఓటమి తప్పదంటే.. ఇక గెలిచేవారు ఎవరుంటారూ అంటారా? లేదండోయ్… తెరాసకు చెందిన ఓ ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని కూడా చెప్పారు. మంత్రి ఈటెల రాజేందర్, మరో మంత్రి హరీష్ రావుతోపాటు మరో ఇద్దరు లేదా ముగ్గురు వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అయితే, తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు ఇంకాస్త సమయం ఉందన్నారు. ప్రస్తుతం తనకు 53 సంవత్సరాలనీ, కొన్నాళ్లు ఆగిన తరువాత కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతానని అన్నారు. సీఎం పదవి చేపట్టే అవకాశం తనకు 2024 వరకూ ఉందని కోమటిరెడ్డి చెప్పుకున్నారు.
ఇక, పీసీసీ పదవి గురించి మాట్లాడుతూ… ఆ పదవిపై తనకు పెద్దగా వ్యామోహం లేదన్నట్టు చెప్పారు. సమయం వచ్చినప్పుడు అన్ని పదవులూ వస్తాయనీ, అయినా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న తనకు చిన్నచిన్న పదవులపై పెద్దగా ఆసక్తి లేదని వ్యాఖ్యానించారు. అంటే, ఆయన దృష్టిలో పీసీసీ అధ్యక్ష హోదా అనేది చాలా చిన్న పదవి అన్నమాట. అంతేలెండీ… ముఖ్యమంత్రి అభ్యర్థిని తానే అని అనుకుంటున్నప్పుడు ఇలాంటివన్నీ చిన్నగానే కనిపిస్తాయి. మొత్తానికి, కాంగ్రెస్ తరఫున సీఎం రేసులో తానూ ఉన్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి నొక్కి వక్కాణిస్తున్నారని అనుకోవాలి. తనను తాను సీఎం అభ్యర్థిగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఆశలతో ఉన్నవారు ఇంకొంతమంది కూడా ఉన్నారు కదా!