వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ తన ముఖ్యమంత్రి అభ్యర్ధిగా డిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరుని ఖరారు చేసింది. ఈమేరకు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ డిల్లీలో కొద్ది సేపటి క్రితమే ఒక ప్రకటన చేశారు.
ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్న ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ సూచన మేరకే బ్రాహ్మణ కులానికి చెందిన షీలా దీక్షిత్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రియాంక వాద్రాకి ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించమని ఆయన చేసిన మరో సూచనని కూడా కాంగ్రెస్ అధిష్టానం పాటించేందుకు సిద్దమవుతున్నట్లే ఉంది. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమైనవో తెలిసిన ఆమె కూడా అందుకు అంగీకరించారని తాజా సమాచారం. రెండు రోజుల క్రితమే ఆమె గులాం నబీ ఆజాద్ తో సమావేశమయ్యి ఎన్నికల ప్రచార బాధ్యత గురించి చర్చించారు.
షీలా దీక్షిత్ 15 ఏళ్ళపాటు ఏకధాటిగా డిల్లీ ముఖ్యమంత్రిగా పరిపాలించారు. ఆమె మంచి సమర్దురాలైన ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకొన్నారు. అయితే ఆమెకి రెండు ప్రతికూల అంశాలు ఉన్నాయి. 1. వయసు. 2. రూ.400 కోట్ల నీళ్ళ ట్యాంకర్ల కుంభకోణం.
రాజకీయాలలో పాల్గొనేందుకు తన వయసు ప్రతిబంధకం కాదని 78 ఏళ్ల వయసున్న షీలా దీక్షిత్ ఆమె వాదిస్తుంటారు. తనకంటే చాలా తక్కువ వయసున్న ముఖ్యమంత్రులు కూడా తనతో పోటీపడి పనిచేయలేరని సవాలు విసురుతుంటారు. తనని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించబోతోందని తెలిసిన తరువాత మోడీ ప్రభుత్వం ఈ నీళ్ళ ట్యాంకర్ల కుంభకోణం పేరు చెప్పి తనపై బురద జల్లెందుకు ప్రయత్నిస్తోందని ఆమె వాదిస్తున్నారు. తన సుదీర్గ రాజకీయ జీవితంలో ఏనాడూ అవినీతికి పాల్పడలేదని, ఆ సంగతి డిల్లీ ప్రజలకి బాగా తెలుసని ఆమె వాదిస్తారు. ఆమె తన ఈ వాదనలతో ఉత్తరప్రదేశ్ ప్రజలని ఒప్పించగలిగితే ఆమెదే విజయం.