తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కూటమి పోటీ చేసింది. భాగస్వామ్య పార్టీలకు కొన్ని సీట్లను కాంగ్రెస్ కేటాయించింది. కానీ, ప్రజా కూటమి ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత కాస్త డీలా పడ్డ కాంగ్రెస్ నేతలు… ఇప్పుడు మెల్లగా లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు. దీంతో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాల్సిన అవసరముంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ నేతలందరితోనూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యేందుకు పీసీసీ కూడా సిద్ధమౌతోంది. మరో రెండురోజుల్లో సమీక్ష సమావేశాలు జరపాలని భావిస్తోంది.
ఈ సమావేశాల్లో లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏర్పడిన ప్రజా కూటమి పరిస్థితి ఏంటనేది కూడా త్వరలోనే తేలిపోతుంది. లోక్ సభ ఎన్నికల్లో కూడా వీరంతా కలిసికట్టుగా పోటీ చేస్తారా… లేదంటే, కాంగ్రెస్ సొంతంగా పోటీకి దిగుతుందా అనేది చూడాలి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానికి గల కారణాలపై ఇప్పటికే హైకమాండ్ కి పీసీసీ ఒక నివేదిక పంపింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే నష్టపోయామని కొంతమంది నేతలు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. అయితే, పీసీసీకి అలాంటి అభిప్రాయం లేదని సమాచారం. ఎన్నికల కమిషన్ చేసిన పొరపాట్ల కారణంగానే దాదాపు 15 సీట్లలో సీట్లు కోల్పోవాల్సి వచ్చిందనేది పీసీసీ అభిప్రాయంగా తెలుస్తోంది. కొంతమంది అభ్యర్థుల ఎంపికలో కూడా పొరపాట్లు జరిగినట్టు హైకమాండ్ కి పంపిన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.
పీసీసీ అభిప్రాయం చూస్తుంటే… లోక్ సభ ఎన్నికల్లో కూడా తెలంగాణలో టీడీపీతో కలిసి కొనసాగే అవకాశాలు కొంత ఉన్నట్టుగానే కనిపిస్తోంది. కానీ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే… ప్రజా కూటమి కొనసాగింపు సాధ్యం కాదనే అనిపిస్తోంది. ఇక్కడున్న మరో సమస్య.. ఆంధ్రాలో కాంగ్రెస్ తో కలిసి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు టీడీపీ సిద్ధపడుతుందా అనేది! తెలంగాణ ఫలితంతో అక్కడ కూడా కాంగ్రెస్ తో కలిసి వెళ్లొద్దనే అభిప్రాయాలే టీడీపీ శ్రేణుల నుంచీ వినిపిస్తున్నాయి. ఆంధ్రాలో సమీకరణాల దృష్ట్యా తెలంగాణ ప్రజా కూటమిలో టీడీపీ కొనసాగుతుందా లేదా అనేది తేలుతుంది. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీతో కాంగ్రెస్, ఆంధ్రాలో కాంగ్రెస్ తో టీడీపీ.. ఈ రెండూ ఫిఫ్టీ ఫిఫ్టీ అవకాశాలే కనిపిస్తున్నాయి.