తెలంగాణలో మహా కూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు ఇప్పటికీ ఒక కొలీక్కి రాలేదు. ఏదేమైనా, దాదాపు 90 స్థానాల్లో సొంతంగా పోటీ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఉంది. సీట్ల సర్దుబాట్ల విషయంలో టీడీపీ కాస్త పట్టు విడుపు ధోరణిలో ఉందనేది స్పష్టమైపోయింది. ఒకట్రెండు సీట్లు తగ్గినా ఫర్వాలేదనీ, దక్కించుకున్న సీట్లలో కచ్చితంగా గెలవాలంటూ టీడీపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక, కూటమిలో సీట్ల సంఖ్య విషయమై టీజేఎస్ వ్యవస్థాపకుడు కోదండరామ్ గట్టి పట్టుదలతో ఉన్నారు. తమ పార్టీకి 15 సీట్లకు తగ్గకుండా ఇవ్వాలంటూ ఆయన పట్టుబడుతున్నారు. కానీ, కాంగ్రెస్ నంబర్ మాత్రం 8కి దాటడం లేదు.
సీట్ల సర్దుబాటు అంశమై కోదండరామ్ తో కాంగ్రెస్ నేతలు ఫోన్లలో చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన ఆఫర్ ను కోదండరామ్ ముందు కాంగ్రెస్ ఉంచినట్టు తెలుస్తోంది. అదేంటంటే… కోదండరామ్ ఎన్ని సీట్లు కోరితే… అన్నీ ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధమని ఒక ప్రతిపాదన పెట్టారట! కానీ, ఇక్కడ కండిషన్స్ అప్లై. ఆ షరతులు ఏంటంటే… టీజేఎస్ అడిగినన్ని సీట్లు ఇస్తారు, కానీ కాంగ్రెస్ సూచించిన స్థానాల్లో మాత్రమే పోటీ చెయ్యాలి..! కోదండరామ్ అడుగుతున్న స్థానాల్లో పోటీకి అవకాశం ఇవ్వరన్నమాట! ఈ ఆఫర్ వద్దనుకుంటే… ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎన్ని సీట్లు కేటాయిస్తే వాటిని తీసుకుని… టీజేఎస్ ఎక్కడ కావాలంటే అక్కడ పోటీకి దిగొచ్చట! అడుగుతున్న నంబర్ కావాలంటే… కోరుకున్న స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. కోరుకున్న స్థానాల్లో పోటీ చేయాలనుకుంటే అడుగుతున్న నంబర్ ను వదులుకోవాలి.
ఈ ఆఫర్ వెనక కాంగ్రెస్ వ్యూహమేంటో ఇట్టే అర్థమైపోతోంది. కాంగ్రెస్ గెలుపు అసాధ్యం అనుకున్న స్థానాల్లో టీజేఎస్ కి అవకాశం ఇచ్చేస్తుంది! తెరాస బలంగా ఉన్న నియోజక వర్గాలు, మజ్లిస్ పట్టున్న ప్రాంతాల్లో సర్దుబాటు చేసేస్తారన్నమాట! అయితే, ఈ ఆఫర్ మీద ఇంకా టీజేఎస్ స్పందించాల్సి ఉందని సమాచారం. గురువారం నాడు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదండరామ్ లు భేటీ అవుతారని సమాచారం. ఏదేమైనా, ఈ నెల 27 నాటికి మహా కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఓ కొలీక్కి వచ్చేస్తుందంటున్నారు. భాగస్వామ్య పక్షాలకు వీలైనన్ని తక్కువ సీట్లు సర్దుబాటు చేద్దామనే పట్టుదల కాంగ్రెస్ లో చాలా స్పష్టంగా ఉంది.