ఆరునూరైనా వరంగల్ ఉప ఎన్నికలో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అభ్యర్థి ఎంపికపై సీరియస్ గా కసరత్తు చేస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ కీలక నేతగా ఉన్న వెంకట స్వామి కుమారుడు వివేక్ ను పోటీకి దింపాలని హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. ఆయన్ని ఢిల్లీకి పిలిపించి చర్చించడం కూడా జరిగిపోయింది. గురువారం హైదరాబాద్ లోదిగ్విజయ్ సింగ్ పలువురు పార్టీ నేతలతో చర్చించారు. అందులోనూ వివేక్ పోటీ చేస్తే బాగుంటుందని చాలా మంది చెప్పినట్టు తెలుస్తోంది. అయితే వివేక్ మాత్రం పోటీకి వెనుకాడుతున్నట్టు భోగట్టా.
వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ ఓ సర్వే చేయించింది. వివేక్ అభ్యర్థి అయితే గెలిచే అవకాశం ఉంటుందని అందులో తేలినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి వివేక్ ను ఒప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఈ ఉప ఎన్నికలో గెలిస్తే పరవాలేదు, ఓడితే 2019లో పెద్దపల్లి టికెట్ దక్కదేమో అనేది వివేక్ అనుమానమని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అలాంటి భయాలేమీ పెట్టుకోవద్దని ఢిల్లీ పెద్దలు భరోసా ఇచ్చారంటున్నారు.
వరంగల్ లో వివేక్ విజయం ఖాయమని, ఒక వేళ ఓడితే రేపు పెద్దపల్లి టికెట్ కు అడ్డేమీ లేదని ఢిల్లీ పెద్దలు చెప్పారని ప్రచారం జరుగుతోంది. అయినా వివేక్ వెనుకాముందు ఆడుతున్నారు. దీంతో అభ్యర్థి ఎంపిక వాయిదా పడింది. నిజానికి గురువారం నాడే తేల్చేద్దామని కాంగ్రెస్ నేతలు భావించారు. కానీ వివేక్ సమ్మతి తెలపక పోవడం, ఇంకా కొందరు నేతల అభిప్రాయాలు తీసుకోవాలని దిగ్విజయ్ సింగ్ భావించడంతో కనీసం శనివారం వరకూ అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేదు.
వెంకటస్వామి కొడుకుగా, పెద్దపల్లి ఎంపీగా, పారిశ్రామికవేత్తగా వివేక్ అందరికీ సుపరిచితుడు. స్థానికేతరుడే అయినా కేడర్ ను సమీకరించి ఉత్సాహంగా పనిచేసేలా చూడగలడు. ఆర్థికంగా బలవంతుడు. ఎలక్షన్ మేనేజిమెంట్ బాగా తెలిసిన వాడు. రాష్ట్ర, జిల్లా నేతల్లో చాలా మంది ఆయన వైపే మొగ్గు చూపుతున్నాడు. చురుకైన వాడు, సంపన్నుడు కావడం ప్లస్ పాయింట్ అనేది వారి ఉద్దేశం. శుక్ర, శనివారాల్లో వివేక్ ను ఒప్పించడానికి ప్రయత్నాలు జరగవచ్చు. గెలుపు గుర్రంగా ముద్రపడ్డ వ్యక్తిని అంత తేలిగ్గా వదులుకోవడం రాజకీయ పార్టీలకు ఇష్టం ఉండదు. కాబట్టి పార్టీ మొత్తం ఏకతాటిపైకి వచ్చి ఆయన్ని గెలిపించుకుంటుదని ఢిల్లీ పెద్దలు గట్టి భరోసా ఇవ్వ వచ్చంటున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఒకవేళ వివేక్ పోటీకి అస్సలు ఒప్పుకోక పోతే ఎలా అన్నదే కాంగ్రెస్ పార్టీ డైలమా. అప్పుడు మాజీ ఎంపీ సర్వే సహా మరికొందరి పేర్లను పరిశీలించే అవకాశం ఉంది.