ముందస్తు ఎన్నికలు ముంచుకొచ్చి… టీఆర్ఎస్ అధినేత అభ్యర్థుల్ని కూడా ప్రకటించిన దాదాపుగా రెండు వారాల తర్వాత… కాంగ్రెస్ పార్టీ .. ఎన్నికల కమిటీల్ని ప్రకటించింది. ఈ ఎన్నికల కమిటీల్ని చూసిన తర్వాత… చాలా మంది ఇవి ఈ ఏడాదివేనా అని తరచి తరచి చూసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే.. అందులో గత వారమే టీఆర్ఎస్లో చేరిపోయిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి పేరు ఉంది. మాజీలయిపోయిన ఎమ్మెల్యేంలదర్నీ… ఇప్పుడు ఎమ్మెల్యేలుగా పేర్కొంటూ.. కమిటీల్లో స్థానం కల్పించారు. నిజానికి వీరంతా మాజీలయిపోయి రెండు వారాలు దాటిపోయింది. దీంతో కాంగ్రెస్ కమిటీల ప్రకటనలు బయటకు రాగానే.. కాంగ్రెస్ అంటే ఇంతేనేమో అనుకున్నారు. కాసేపటికి తప్పు తెలుసుకుని దిద్దుకునే ప్రయత్నం చేశారు. సురేష్ రెడ్డి పేరు తీసేసి.. కొత్త లిస్ట్ ప్రకటించారు. ఓ సారి తప్పు చేసిన తర్వాత దిద్దుకున్నా… పెద్ద తేడా ఉండదు.
పోనీ పదవులు అయినా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి.. విజయం దిశగా తీసుకెళ్లే నేతలకు కట్టబెట్టారా అంటే… పార్టీలో ఉన్న సీనియర్ నేతలు, పలుకుడి ఉన్న వర్గాలను సంతృప్తి పరచడానికే.. అన్నట్లుగా ఆ కమిటీలు తయారయ్యాయి. రేవంత్ రెడ్డి,, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇచ్చారు. కానీ… ఈ వర్కింగ్లు మరో ఇద్దరు ఉన్నారు. ఇప్పటికే ఉన్న మల్లు భట్టి విక్రమార్క, కొత్తగా పొన్నం ప్రభాకర్‌కు కూడా అదే పదవి ఇచ్చారు. పేరుకు తప్ప.. ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఏమి చేస్తారు. ఇక మల్లు భట్టి విక్రమార్కకు.. ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. ప్రచార కమిటీ అంటే.. రాష్ట్ర వ్యాప్తంగా.. ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఓ రకంగా.. పీసీసీ చీఫ్ కన్నా… ప్రచార కమిటీకే క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పదవి.. క్రౌడ్ పుల్లర్, జనాకర్షణ ఉన్న నేతను నియమించుకోవాలి. దానికి రేవంత్ రెడ్డి కరెక్ట్. కానీ కాంగ్రెస్ మాత్రం.. మల్లు భట్టివిక్రమార్కలో కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కొనే నేతగా చూసింది.
ఇక మేనిఫెస్టో కమిటీ డిప్యూటీ చైర్మన్‌గా కోమటిరెడ్డిని నియమించారన్న ప్రచారం జరగడంతో.. ఒక్కసారిగా గగ్గోలు రేగింది. పీసీసీ బాధ్యతలు తీసుకుని.. పార్టీని గెలిపించి.. ముఖ్యమంత్రి అయిపోదామని… ఆశ పడ్డ కోమటిరెడ్డి బ్రదర్స్‌కు లిస్ట్ తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఈ విషయం వెంటనే ఢిల్లీ పసిగట్టేసిందేమో కానీ.. ప్రచార కమిటీకి పోటీగా.. పబ్లిసిటీ కమిటీని ప్రకటించింది. దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చైర్మన్‌గా ప్రకటించారు. అంతేనా ఎన్నికల కమిటీకి పీసీసీ చీఫ్ నేతృత్వం వహిస్తారు. పదవులు పొందిన వారు కూడా.. ఉత్తమ్‌తో సన్నిహితంగా ఉండేవాళ్లే. ఆయనను విబేధించే వాళ్లకు పెద్దగా చాయిస్ దక్కలేదు. రేవంత్ తో పాటు పార్టీలో చేరిన వారికీ గిట్టుబాటు కాలేదు. ఎలా చూసినా… కాంగ్రెస్ కమిటీలు.. కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి కాకుండా.. తమతో తామే పోరాడుకోవడానికి బలం సమకూర్చుకున్నట్లుగా.. కాంగ్రెస్ నేతలంతా కలసి నేతలు ఏర్పాటు చేసుకున్న కమిటీల్లా మారాయని.. కాంగ్రెస్ కార్యకర్తలు.. సెటైర్లు వేసుకుంటున్నారు.