తెలంగాణలో రాహుల్ టూర్ రెండు రోజుల పాటు సాగనుంది. ఆరో తేదీన వరంగల్‌లో రైతు సంఘర్షణ సభకు హాజరవుతారు. ఈ సభకు జన సమీకరణకు రేవంత్ రెడ్డి పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారన్న విధంగా తరలి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. రెండో రోజుహైదరాబాద్లో పర్యటించబోతున్నారు.షెడ్యూల్ ప్రకారం గాంధీ భవన్ సమీక్ష ఒక్కటే ఉండాలి. కానీ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాందీ పర్యటన ప్రజల్లో నానాలన్న కారణంతో ఉస్మానియాలో విద్యార్థులతో భేటీ ఏర్పాటు చేశారు. ఈ భేటీకి ఉస్మానియా పాలకవర్గం అనుమతి నిరాకరించింది. అంతే ఇదే సందుగా కాంగ్రెస్ నేతలు రచ్చ ప్రారంభించారు.
యూత్ కాంగ్రెస్ నేతలు మొదట ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి బెయిల్ కోసం ప్రయత్నించకుండా రాహుల్ గాంధీతో పరామర్శ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. ఇవాళ రేవంత్, జగ్గారెడ్డి సహా అందరూ వెళ్లి విద్యార్థి నేతల్ని పరామర్శించి వచ్చారు. ఏడో తేదీవరకూ వాళ్లను జైల్లోనే ఉంచితే… రాహుల్ గాంధీ జైలుకు వస్తారని… ములాఖత్‌కు దరఖాస్తు చేశారు. మరోవైపు ఉస్మానియాలో విద్యార్థులతో మీటింగ్ కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. ఉస్మానియాలో ఆందోళనలు చేస్తున్నారు. ఇవన్నీ రోజంతా హైలెట్ అవుతున్నాయి.
తెలంగాణలో రాహుల్ పర్యటనను అదే పనిగా ఎక్స్ పోజ్ చేస్తున్నారు. రోజంతా వార్తల్లో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వ కట్టడి చర్యలు కూడా దానికి తగ్గట్లుగానే ఉన్నాయి. వాటిని కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా ఉపయోగించుకుటూ ముందుకు వెళ్తున్నారు. వచ్చే ఎన్నికలకు రాహుల్ గాంధీ టూర్ చాలా ముఖ్యమని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ప్రచారం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.