హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ మృతిపై రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. “అతని మృతిపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు మాట్లాడటం లేదు? బజారుకెళ్ళి బట్టలు కొనుక్కోవడానికి తీరిక ఉన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రోహిత్ తల్లిని ఎందుకు పరామర్శించలేదు? నిత్యం మోడీని, బీజేపీని విమర్శించే మంత్రి కె.టి.ఆర్. రోహిత్ మృతి గురించి ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? పైగా రోహిత్ మృతికి కారకుడని భావిస్తున్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అరెస్ట్ చేయడం మాని ఆయన రక్షణ కోసం 500 మంది పోలీసులను ఎందుకు నియమించారు?” అని పిసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ నిన్న మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ని, ఆయన పార్టీ నేతలని నిలదీశారు.
“ముఖ్యమంత్రి కుమార్తె కవిత ఇద్దరు కేంద్రమంత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. కానీ ఆమె తండ్రి సోదరుడు మాత్రం ఈ విషయంపై పెదవి విప్పరు. మొదట ఆమె తన తండ్రి కేసీఆర్, సోదరుడు కె.టి.ఆర్.లను దీనిపై నోరు విప్పి మాట్లాడమని చెపితే బాగుంటుంది. రోహిత్ మృతిపై అందరూ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్న తెరాస నేతలు, ఈ సంఘటనపై తమ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి,” అని దాసోజు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేసారు.
రోహిత్ మృతిపై రెండు రాష్ట్రాలలోని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి, డొక్కా మాణిక్యవర ప్రసాద్ స్పందిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఆ తరువాత విమర్శలు రావడంతో దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనిపై విచారం వ్యక్తం చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబు రోహిత్ తల్లిని, సోదరుడిని కలిసి ఓదార్చారు. వారి కుటుంబానికి రూ.5లక్షల నగదు, వారిరువురికీ రాష్ట్రంలో ఏదయినా కళాశాలలో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చేరు. కనుక రోహిత్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరిగ్గానే స్పందించిందని భావించవచ్చును.
ఈ వ్యవహారంలో బీజేపీ మంత్రుల పేర్లు వినిపిస్తున్నందున, బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న తెదేపా మౌనం వహిస్తోందంటే అర్ధం చేసుకోవచ్చును. కానీ బీజేపీతో నిత్యం పోరాడుతున్న మంత్రి కె.టి.ఆర్.,తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్,తెరాస నేతలు కూడా సరిగ్గా జి.హెచ్.ఎం.సి. ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటనపై మౌనం వహించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.