న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్.ఎస్.జి.)లో భారత్ సభ్యత్వం కోసం ప్రధాని నరేంద్ర మోడీ విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ, చైనా అడ్డుపడటంతో ఆ అవకాశం చేజారిపోయింది. ఎన్.ఎస్.జి.లోని 48 సభ్యదేశాలు ఈరోజు సమావేశం అయ్యాయి. కానీ భారత్ చేరికపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగించాయి. రేపు మళ్ళీ మరొకమారు సమావేశం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, చైనా మరికొన్ని దేశాలు అడ్డుపడుతున్న కారణంగా భారత్ కి ఎన్.ఎస్.జి.లో చేరే అవకాశం లేనట్లే భావించవచ్చు.
ఇది ప్రధాని మోడీకి ఆయన ప్రభుత్వానికి చాలా నిరాశ కలిగించింది. దాని ప్రయోజనాలు తెలిసిన దేశప్రజలు కూడా ఇటువంటి సువర్ణావకాశం చేజారిపోయినందుకు చాలా బాధపడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మోడీ తన ప్రయత్నాలలో విఫలం అయినందుకు చాలా సంతోషపడుతోంది. భారత్ కి ఎంతో లబ్ది కలిగించే ఎన్.ఎస్.జి.లో ప్రవేశం కోసం విశ్వప్రయత్నాలు చేసిన మోడీని అభినందించకపోగా, మోడీకి దౌత్యపద్దతులు తెలియవని ఎగతాళి చేసింది.
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశంలో ఉన్న గంభీరతని, దాని లోతుపాతులని అర్ధం చేసుకోకుండా అదేదో తమాషా అన్నట్లుగా వ్యవహరించి ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు మంటగలిపారు. అసలు ఎన్.ఎస్.జి.లో భారత్ ప్రవేశించడం అసాధ్యమని తెలిసి ఉన్నప్పుడు ఎందుకు ప్రయత్నించారు? దాని కోసం అనవసరమైన లాబీయింగ్ ఎందుకు చేశారు? ఎన్.ఎస్.జి.లో ప్రవేశం సాధ్యం కాదని తెలిసినప్పుడు దానికోసం ప్రయత్నించే బదులు, ఆ శ్రమేదో ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్ కి సభ్యత్వం కల్పించేందుకు పెట్టి ఉండి ఉంటే ఏమైనా ప్రయోజనం ఉండేది. అనవసరమైన, ఆసాద్యమైన ఈ అంశాన్ని ఆయన భుజానికెత్తుకొని సాధించింది ఏమీ లేదు కానీ ప్రపంచ దేశాలకి తన గురించి గొప్పగా పరిచయం చేసుకొని, భారత్ కి చాలా అవమానకరమైన పరిస్థితి కల్పించారు. ఆయన చేసిన ఈ అనాలోచిత ప్రయత్నం వలన భారత్, పాకిస్తాన్ దేశాలని ఒకే గాట కట్టేసినట్లయింది. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ దౌత్య వ్యవహారాలూ, వాటి విధివిధానాలు, లోతుపాతుల గురించి అవగాహన పెంచుకొనే ప్రయత్నం చేస్తే బాగుంటుంది,” అని విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నాలను విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఒకవేళ అయన ప్రయత్నాలు ఫలించి భారత్ కి ఎన్.ఎస్.జి.లో ప్రవేశం లభిస్తే ఏవిధంగా స్పందించేదో? కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఎన్.ఎస్.జి.లో ప్రవేశం కోసం ప్రయత్నం చేయలేదు. తను చేయని, చేయలేని పనిని చేసిన ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం దేశ ప్రజల అభిప్రాయాలని, ఆలోచనలని అర్ధం చేసుకోకుండా ఈవిధంగా వ్యవహరిస్తుండటం వలననే దానిని ప్రజలు పదేపదే తిరస్కరిస్తున్నారు. ఆ సంగతి ఇంకా ఎప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం గ్రహిస్తుందో లేదో తెలియదు.
మోడీకి దౌత్య విధానాలు, వాటి లోతుపాతులు తెలియవని ఆక్షేపిస్తున్న కాంగ్రెస్ పార్టీ, మోడీ చొరవ వలననే సాక్షాత్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ కి మద్దతు పలికిన సంగతి మరిచిపోయినట్లుంది. అమెరికాతో సహా అనేక దేశాలు కూడా భారత్ కి మద్దతు ఇచ్చాయి. ఎందువల్ల, ఎవరి చొరవ వలన అవి మద్దతు పలికాయి? “రక్షణ రంగంలో భారత్ మా భాగస్వామి” అని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడానికి ఏమిటర్ధం? పాకిస్తాన్ కి ఎఫ్-16 యుద్ధ విమానాలు సరఫరా నిలిపివేసి, భారత్ కి డ్రోన్ విమానాలు సరఫరా చేయడానికి అమెరికా ఎందుకు అంగీకరించింది? మోడీకి దౌత్యం తెలియకపోతే ఇవన్నీ సాధ్యమేనా? అని కాంగ్రెస్ ఆలోచిస్తే బాగుండేది.